కల్తీ నెయ్యి సరఫరా కేసులో నిందితుడిగా ఉన్న కదురు చిన్నప్పన్న తనకు 2018 వరకు మాత్రమే పీఏగా పనిచేశాడని, ఆ తర్వాత అతనితో ఎలాంటి సంబంధం లేదని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెబుతున్న నేపథ్యంలో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి.
సాధారణ భక్తులు శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ఉచిత దర్శన టోకెన్లకు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోంది. రూ.300 సుపథం టికెట్లు ఆన్లైన్ ద్వారా లేదా ప్రజాప్రతినిధుల సిఫారసుతో దొరికితే అదృష్టంగా భావించే పరిస్థితి ఉంది.
అలాంటి సమయంలో 2021 సెప్టెంబరు నెలలో మాత్రమే చిన్నప్పన్న పేరు మీద టీటీడీ ఛైర్మన్ కార్యాలయం నుంచి 6,433 సుపథం టికెట్లు జారీ అయినట్లు సమాచారం. అంటే రోజుకు సగటున 214 టికెట్లు జారీ అయినట్టుగా లెక్కలు చూపిస్తున్నాయి. ఈ వ్యవహారం రోజూ నిరవధికంగా కొనసాగినట్లు తెలుస్తోంది.
వైసీపీ హయాంలో ఒక్కో ఎమ్మెల్యేకి రోజుకు ఆరు సుపథం టికెట్లు మాత్రమే, అది కూడా వారానికి ఐదు రోజులపాటు మాత్రమే ఇచ్చే పరిమితి ఉండేదని అధికారులు చెబుతున్నారు.
అలాంటిది ఒక వ్యక్తి పేరు మీదే నెలలో వేల సంఖ్యలో టికెట్లు జారీ కావడం అనుమానాలకు తావిస్తోంది. ఈ లెక్కన సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న నాలుగేళ్ల కాలంలో చిన్నప్పన్న పేరు మీద ఎన్ని టికెట్లు జారీ అయ్యాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. వీఐపీ బ్రేక్ దర్శనం, ఆర్జితసేవల టికెట్ల జారీపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.
సుబ్బారెడ్డి మాత్రం చిన్నప్పన్న 2014–2018 మధ్యే తన వద్ద పీఏగా పనిచేశాడని, తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్‌లో లైజన్ అధికారిగా పనిచేశాడని, తనతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటున్నారు.
అయితే ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగి పేరు మీదే ఛైర్మన్ కార్యాలయం నుంచి వేల టికెట్లు జారీ కావడంపై ఆశ్చర్యం కలిగించే అంశం. టీటీడీతో అధికారిక సంబంధం లేని వ్యక్తి పేరు మీద ఈ స్థాయిలో టికెట్లు ఎలా జారీ అయ్యాయి? ఆ అనుమతులకు ఆధారం ఏమిటి? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రధానంగా మారాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates