మళ్లీ మొదలుబెట్టిన కొలికపూడి?

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలి పార్టీకి తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. స్థానిక టీడీపీ నేతలతో వివాదాలు మొదలుకొని…ఎంపీ కేశినేని చిన్నిపై సంచలన ఆరోపణల వరకు ఆయన వల్ల పార్టీకి అయిన డ్యామేజీ అంతా ఇంతా కాదు.

అమరావతి రైతుల ఉద్యమ నేతగా రాష్ట్ర ప్రజలకు పరిచయమైన కొలికపూడికి పిలిచి మరీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు చంద్రబాబు. ఆ తర్వాత అదే చంద్రబాబు..పద్ధతి మార్చుకోవాలని ఆయనకు క్లాస్ పీకారు. గతంలో నందిగామ టూర్ లో తనకు నమస్కరిస్తున్న కొలికపూడిని పలకరించకుండా చంద్రబాబు వెళ్లిపోయారు.

చిన్ని ఇష్యూలో పార్టీ క్రమశిక్షణా కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చే పరిస్థితి వచ్చినా కూడా తీరు మారినట్లు కనిపించడం లేదు. తాజాగా మరోసారి ఏకంగా కూటమి ప్రభుత్వాన్ని అవమానించేలా పరోక్షంగా కొలికపూడి వ్యవహరించిన తీరు షాకింగ్ గా మారింది.

ఏపీలో పాలన సరిగా లేదని అర్థం వచ్చేలా పరోక్షంగా ఆయన పెట్టిన వాట్సప్ స్టేటస్ సంచలనం రేపుతోంది. 3 వారాల పాటు 35 గ్రామాల్లో 480 కుటుంబాలతో ఆత్మీయ సంభాషణ జరిపానని..రోడ్లు లేని పల్లెలు…ఉద్యోగాలు రాని పిల్లలు…పల్లె కన్నీరు పెడుతోందని…తన వాట్సాప్ స్టేటస్ లో కొలికపూడి రాసుకొచ్చారు.

అయితే, చంద్రబాబు పాలనను విమర్శిస్తూ వైసీపీ నేతలు పెట్టిన మాదిరిగా కొలికపూడి వాట్సాప్ స్టేటస్ పెట్టారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. సొంత పార్టీ పరువు తీసేలా చాలాకాలంగా వ్యవహరిస్తున్న కొలికపూడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, లేదంటే ఇంకా నష్టం జరుగుతుందని తెలుగు తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి, కొలికపూడి వాట్సాప్ స్టేటస్ పై టీడీపీ హై కమాండ్ స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.