ఏపీలో తెర మీదకు వచ్చిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం రాజకీయం మరింత ముదురుతోంది. ఇవి ఎప్పటి వరకు సాగుతాయి? ఎంత వరకు కొనసాగుతాయి? అనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం తెరపైకి వచ్చింది. 2024 జూన్‌లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదే ఏడాది సెప్టెంబర్‌లో ఈ వ్యవహారం బయటకు వచ్చింది.
అప్పట్లో సీఎం చంద్రబాబే స్వయంగా లడ్డూ వ్యవహారంపై వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఈ వ్యవహారంపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడి నుంచి ప్రారంభమైన విచారణ ఏడాది పాటు కొనసాగింది. గత నెలలో సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికను సమర్పించింది. అదే సమయంలో చార్జిషీట్‌ను కూడా దాఖలు చేసింది. దీనిపై విచారణ కొనసాగాల్సి ఉంది.
ఇంతలోనే లడ్డూపై రాజకీయం మరింత వేడెక్కింది. రెండోసారి ఈ వివాదాన్ని వైసీపీ మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. గతంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా సీబీఐ నివేదికలో ఉన్న అంశాలను ప్రస్తావిస్తూ వైసీపీ నేతలు స్పందించారు. జంతువుల కొవ్వు కలిసినట్లు ఎక్కడా నివేదికలో లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పూజలు నిర్వహించి నిరసనలు తెలిపారు. దీనికి కౌంటర్‌గా టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఈ పరిణామాలతో శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వివాదం దాడులు, అరెస్టులు, జైలు వరకు వెళ్లింది. ఇక ఇప్పుడు ఈ వ్యవహారం ఇక్కడితో ఆగుతుందా అనే ప్రశ్న ఎదురవుతోంది. ప్రభుత్వం మరోసారి కమిషన్ వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. సిట్ అధికారులు తేల్చని అంశాలను మళ్లీ పరిశీలించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే కోర్టులో ఉన్న సిట్ నివేదికపై విచారణ పూర్తయ్యే వరకు ప్రభుత్వం కొత్త కమిటీ లేదా కమిషన్ ఏర్పాటు చేసే అవకాశం లేదు. అన్ని కోణాల్లో పరిశీలిస్తే తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారం వచ్చే ఎన్నికల వరకు కొనసాగినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
