జనసేన కీలక నాయకులపై ఆపార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. “మీరెందుకు మాట్లాడరు?. కూటమి ప్రభుత్వంలో అందరూ కలసి ఉండాలి కదా“ అని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందన్న ఆయన.. వైసీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఒక్క నాయకుడో.. ఒక్క పార్టీనో తిప్పికొడితే సరిపోదని.. అందరూ కలసి కట్టుగా ఉండాలని.. ఈ విషయంలో పార్టీ నాయకులు వెనుకబడ్డారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
ముఖ్యంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించిన వ్యవహారంపై సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విచారణను ముగించిన నెల్లూరులోని ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అనంతరం.. దీనిపై వైసీపీ నాయకులు ప్రభుత్వ తీరును తప్పుబడుతూ.. తీవ్ర విమర్శలు గుప్పించారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసినట్టుగా సిట్ అధికారులు నివేదికలో ఎక్కడా పేర్కొనలేదని.. కానీ, అప్పట్లో సీఎం చంద్రబాబు పెద్ద ఎత్తున తమపై దాడి చేశారని పేర్కొంటూ వైసీపీ నిరసనలు కూడా చేపట్టింది.
ఈ క్రమంలోనే అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై నోరు చేసుకున్నారు. ఈ పరిణామాలతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది. ఈ సమయంలో వైసీపీని ఎదుర్కొనేందుకు.. వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు టీడీపీకి చెందిన నాయకులు మాత్రమే స్పందించారు. మంత్రులు, ఇతర నేతలు టీడీపీ వారే రియాక్ట్ అయ్యారు. ఈ విషయాన్ని తాజాగా ప్రస్తావించిన పవన్ కల్యాణ్.. “కల్తీ లడ్డూ వ్యవహారంపై మన వాళ్లు ఎందుకు మాట్లాడటం లేదు“ అని ప్రశ్నించారు. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్న ఆయన.. ఈ ప్రచారాన్ని జనసేన నాయకులు కూడా తిప్పికొట్టాలని సూచించారు.
కానీ, తాను చెప్పే వరకు ఎందుకు స్పందించడం లేదన్నారు. “అన్నింటికీ నేనే మాట్లాడలేను. ఇక, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు ఉన్నట్టు?“ అని పవన్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేసమయంలో వైసీపీ నేతల ట్రాప్‌లో చిక్కుకోవద్దని సూచించారు. జనసేన నాయకులు, వారి కుటుంబ సభ్యులపైనా వైసీపీ నాయకులు నోరు పారేసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. “కూటమి కలిసి ఉండాలి. ఈ క్రమంలో ఏ ఇబ్బంది వచ్చినా.. అందరూ కలసి కట్టుగా మాట్లాడాలి. మనం కూడా స్పందించాలి. సబ్జెక్ట్ ప్రకారం తిప్పికొట్టాలి.“ అనిపవన్ దిశానిర్దేశం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates