విదేశాల్లో కరోనా వ్యాక్సినేషన్ జోరుగానే సాగుతోంది కానీ.. ఇండియాలో ఆ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందో స్పష్టత లేదు. ఐతే వ్యాక్సినేషన్ కోసం సన్నాహాలు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే మార్గదర్శకాలు అందుతున్నాయి. రాష్ట్రాలు కూడా సన్నద్ధమవుతున్నాయి.
ఐతే కొత్త ఏడాదిలోనే వ్యాక్సిన్ సరఫరా ఉంటుందని భావిస్తున్నారు. కానీ ఆశ్చర్యకరంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 25 నుంచి జనాలకు కరోనా వ్యాక్సిన్ వేయబోతున్నట్లుగా అధికార పార్టీ ముఖ్య నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ వేసి కలకలం రేపారు. దీనిపై ట్విట్టర్లో ఆసక్తికర చర్చ మొదలైన కాసేపటికే ఆయన ఆ ట్వీట్‌ను డెలీట్ చేయడం గమనార్హం.
ఏపీ ప్రభుత్వం డిసెంబర్ 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి కరోనా వ్యాక్సిన్లు ఇవ్వబోతోందని బుధవారం ఉదయం ట్విట్టర్లో విజయసాయిరెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో మొత్తం 4,762 ఆరోగ్య కేంద్రాల్లో ఈ వాక్సినేషన్ జరుగుతుందని ఆయన వివరించారు. కోటికి పైగా టెస్టులు నిర్వహించి వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో రాష్ట్రం విజయం సాధించిందని విజయసాయి రెడ్డి తన ట్వీట్‌లో తెలిపారు.
ఐతే చడీచప్పుడు లేకుండా ఏపీలో ఇంత త్వరగా వ్యాక్సినేషన్ ఏంటనే చర్చ నడిచింది ట్విట్టర్లో. దీనిపై విజయసాయిరెడ్డికి చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. మామూలుగా తనను ఎవరెంతగా విమర్శించినా పట్టించుకోకుండా ట్విట్టర్లో తన స్థాయికి తగని వ్యాఖ్యలు చేస్తుంటారు, వాటికి కట్టుబడే ఉంటారు విజయసాయిరెడ్డి. కానీ ఈ వ్యాక్సిన్ ట్వీట్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గారు. తానిచ్చిన సమాచారం తప్పనో ఏమో.. కాసేపటికే తన ట్వీట్‌ను డెలీట్ చేసేశారు. ఇంత కీలకమైన విషయంలో ఆయన అంత అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శించారో ఏమో?
Gulte Telugu Telugu Political and Movie News Updates