అంబటి ఇంటిపై దాడి… హై టెన్షన్

ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. అంబటిపై కేసు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే, తనను తిట్టిన వారిని తిరిగి తిట్టానని, చంద్రబాబును తిట్టలేదని అంబటి రాంబాబు క్లారిటీనిచ్చే ప్రయత్నం చేసినా తెలుగు తమ్ముళ్ల ఆవేశం తగ్గలేదు. ఈ క్రమంలోనే గుంటూరులోని అంబటి రాంబాబు క్యాంపు కార్యాలయంపై, ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు.

అంబటి ఇల్లు, ఆఫీసుపై రాళ్లు, రాడ్లు, కర్రలతో దాడి చేశారు. తలుపులు, కిటికీలు పగల గొట్టి లోపల ఫర్నిచర్ ధ్వసం చేశారు. అంబటి రాంబాబుకు చెందిన కార్లను కూడా ధ్వంసం చేశారు.

గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలోనే అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంబటి ఇంట్లోకి వారు చొరబడి దాడి చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.

ఈ దాడి తర్వాత అంబటి నివాసం దగ్గరకు భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. ప్రస్తుతం అంబటి ఇంటి దగ్గర భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. అక్కడ ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

అంతకుముందు, అంబటి రాంబాబు ఇంటికి పోలీసులు వెళ్లారు. తన ఇంట్లోకి ఎందుకు వచ్చారని అంబటి వారిని ప్రశ్నించారు. నోటీసులు ఇచ్చేందుకు తాము వచ్చామని చెప్పారు. నోటీసులు ఇవ్వాలని అడగగా…మళ్లీ వస్తామని పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.