ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా లోకేష్ రెడీ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే.. ఆయన ఏదైనా భారీ ప్రాజెక్టును ప్రకటించడానికి ముందు.. ప్రజలకు సమయం చెబుతున్న విషయం తెలిసిందే. అలానే.. ఒకటి రెండు రోజుల్లో ఉగాదికి తాను ప్రకటించబోయే భారీ ప్రకటనపైనా నారా లోకేష్ ప్రకటన చేసే అవకాశం ఉంది. దీనికిపై పెద్ద ఎత్తున ఆయన కసరత్తు చేస్తున్నారు.
ఏంటది?
రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పెట్టుబడులకు పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే 23 లక్షల కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు చేసుకున్న ప్రభుత్వం వీటిని సాధ్యమైనంత వేగంగా గ్రౌండింగ్ చేసేందుకు రెడీ అయింది. ఇక, దీంతోపాటు.. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల జాబితాను కూడా రెడీ చేస్తున్నారు. మొత్తంగా 23 వేల పైచిలుకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు తెలిసింది.
వివిధ శాఖల్లో ఖాళీలపై ఇప్పటికే వడపోత చేశారు. అదేవిధంగా ఈ ఏడాది రిటైర్మెంట్ కానున్న ఉద్యోగుల జాబితాను కూడా పరిశీలించి.. అవి ఖాళీ అయ్యేలోగానే భర్తీ చేయాలని నిర్ణయించుకున్నారు. మొత్తంగా 23 వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీని చేపట్టాల్సి ఉంటుందని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఉగాది నాటికి ఈ మొత్తం ఉద్యోగాలకు సంబంధించి(పోలీసు, రెవెన్యూ సహా వివిధ శాఖలు) ఒకేసారి జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు మంత్రి నారా లోకేష్ కసరత్తు చేస్తున్నారు.
ఇది .. ఉగాది నాటికి సిద్ధమవుతుందని.. ఆ రోజు మంత్రి గ్రాండ్ అనౌన్స్‌మెంట్ చేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గతంలో వైసీపీ కూడా జాబ్ క్యాలెండర్ అని హడావుడి చేసినా.. కేవలం 2023లో ఒక్క సారి మాత్రమే ప్రకటించారు. అది కూడా.. పూర్తికాలేదు.
ఇక, 2024లో అసలు ఆ ఊసేలేకుండా పోయింది. ఆ తర్వాత.. కూటమి సర్కారు తొలి ఏడాదే.. డీఎస్సీ ప్రకటించి 16 వేల మందికి కొలువులు ఇచ్చింది. ఇప్పుడు తాజాగా గ్రూప్-1, 2 ఉద్యోగాలను కూడా భర్తీ చేసింది. తాజాగా ఉగాదికి పెద్ద ప్రకటన చేసేందుకు రెడీ అయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates