గ్రౌండ్ లెవెల్ పై రేవంత్ రెడ్డి దృష్టి

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. రెండు సంవ‌త్స‌రాల పాల‌న‌కు ఈ ఎన్నిక‌ల‌ను రిఫ‌రెండంగా భావిస్తున్న రేవంత్ రెడ్డి స‌ర్కారు.. ఈ క్ర‌మంలో స్థానిక పోరుపై బ‌ల‌మైన వ్యూహంతోనే ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకుంది. కేవ‌లం ప‌ది రోజులు మాత్ర‌మే ప్ర‌చారానికి స‌మ‌యం ఉండ‌డం, విస్తృత‌మైన ప‌రిధిలో ప్ర‌చారం చేయాల్సి ఉండ‌డంతో దీనికి సంబంధించిన ప్ర‌ణాళిక‌ల‌ను కూడా.. అదేస్థాయిలో సిద్ధం చేస్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీలో ప‌రిస్థితి ఎలా ఉన్నప్ప‌టికీ.. ఈ ఎన్నిక‌ల్లో మాత్రం విజ‌య‌మే ల‌క్ష్యంగా దూసుకుపోవాల‌న్న‌ది సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్‌. అందుకే ఆయ‌న గ్రౌండ్ లెవిల్లో గెలుపుపై చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు. క్షేత్ర‌స్థాయిలో ప‌ట్టు పెంచుకునే దిశ‌గా నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేశారు. ప్ర‌స్తుతం అమెరికాలో ఉన్న రేవంత్ రెడ్డి తాజాగా శ‌నివారం ఉద‌యం జూమ్ ద్వారా పార్టీ నాయ‌కుల‌తో చ‌ర్చించారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో తదుపరి కార్యాచరణపై ఆయ‌న ప‌క్కా ప్లాన్‌ను వివ‌రించారు.

అభ్య‌ర్థుల ఎంపిక ఇప్ప‌టికే పూర్త‌యిన నేప‌థ్యంలో వారి ఆర్థిక బ‌లాబ‌లాల‌ను తెలుసుకుని.. అవ‌స‌రమైతే.. మ‌ద్ద‌తు ప‌లికే వారిని ప్రోత్స‌హించాల‌ని సూచించారు. ఎక్క‌డా త‌గ్గాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. బీఆర్ ఎస్ నాయ‌కుల వ్యూహాల‌కు ప్ర‌తివ్యూహాలు వేసుకుంటూ ముందుకు సాగాల‌ని సూచించారు. పార్టీ బ‌లంగా ఉన్న స్థానిక సంస్థ‌ల్లోనూ జాగ్ర‌త్తగా వ్య‌వ‌హ‌రించాల‌ని.. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌రాద‌ని కోరారు. ప్ర‌తి డివిజ‌న్‌ను కూడా జాగ్ర‌త్త‌గా అధ్య‌య‌నం చేయాల‌న్నారు.

ప్ర‌తి వార్డు, ప్ర‌తి డివిజ‌న్‌, ప్ర‌తి ఎన్నిక కీల‌క‌మేన‌ని చెప్పిన ఆయ‌న‌.. పార్టీ బలహీనంగా ఉన్న మున్సిపాలి టీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, మంత్రుల మధ్య స‌మ‌న్వ‌యం.. స‌హ‌కారంపై మ‌రింత ఎక్కువ‌గా దృష్టి పెట్టాల‌ని కోరారు. నాయ‌కుల మ‌ధ్య పొర‌పొచ్చాలు ఉంటే.. సీనియ‌ర్లే స‌ర్దుబాటు ధోర‌ణితో ముందుకు సాగాల‌ని సూచించారు. గ్రౌండ్ లెవిల్ గెలుపును ఎవ‌రూ లైట్‌గా తీసుకోవ‌ద్ద‌న్నారు. కాగా.. సోమవారం నుంచి జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు ముఖ్య‌మంత్రి రెడీ అవుతున్నారు.