పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్ సరోజతో కలిసి వెళ్లారు. సమ్మక్క గద్దెకు చేరుకున్న తర్వాత మొదటి కొబ్బరికాయ తామే కొడతామని ఆయన పట్టుబట్టారు.

ఈ క్రమంలోనే సరోజను మహిళా పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తీసుకువెళ్లారు. దీంతో, ఆమెను అవమానించారని, ఆ ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని పోలీసులతో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు.

అయితే, అక్కడి నుంచి వెళ్లిపోవాలని, భక్తులకు ఇబ్బంది కలుగుతుందని కౌశిక్ రెడ్డికి పోలీసులు చెప్పారు. వినకపోవడంతో కౌశిక్ రెడ్డితోపాటు ఆయన సతీమణిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డికి, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

తమను గద్దెల వద్దకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని, కరీంనగర్ సీపీ గౌస్ ఆలం మెడలు పట్టి వెళ్లగొడుతున్నారని ఆరోపించారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తమ ప్రభుత్వం రాగానే ఇలాంటి వారి అంతుచూస్తామని వార్నింగ్ ఇచ్చారు.

ఆ క్రమంలో ఓ పోలీసు అధికారి మీదకు వెళ్లిన కౌశిక్ రెడ్డి…ఆయనను తోసివేశారు. దీంతో, కౌశిక్ రెడ్డిని ఎత్తుకొని వెళ్లి మరీ పోలీసులు తమ వాహనంలో ఎక్కించారు. ఈ క్రమంలోనే కరీం నగర్ సీపీ గౌస్ ఆలంను కౌశిక్ రెడ్డి మతం పేరుతో దూషించారని ఆయనపై ఐపీఎస్ అధికారుల సంఘం, పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరీంనగర్ సీపీ గౌస్ ఆలంకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని పోలీసులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఐపీఎస్ అధికారుల సంఘానికి కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పారు.

తమను గద్దెలపై నుంచి ఈడ్చుకెళ్లారన్న ఫ్రస్టేషన్‌లో కరీంనగర్ సీపీని ఒక మాట అన్నానని కౌశిక్ రెడ్డి అంగీకరించారు. అయితే, ఏ మతాన్నో, కులాన్నో కించపరిచే ఉద్దేశ్యం తనకు లేదని, తనను బలవంతంగా తీసుకువెళుతున్నారన్న కోపంలో తెలియకుండా ఒక మాట జారానని వివరణనిచ్చే ప్రయత్నం చేశారు. తన మాటలతో ఎవరివైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే వారికి క్షమాపణలు తెలియజేస్తున్నానని కౌశిక్ రెడ్డి అన్నారు.

అంతకుముందు, పరిమిత వాహనాలనే జాతరలోకి అనుమతించాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు ఆయన కాన్వాయ్ ను ఆపారు. తన కాన్వాయ్ అడ్డుకోవడంతో కౌశిక్ రెడ్డి తన భార్య, కూతురు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వరంగల్ – కరీంనగర్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. తమను అడ్డుకోవద్దని పోలీసులను కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోన కౌశిక్ రెడ్డిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.