ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కేసీఆర్

తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను కూడా ఈ కేసులో విచారణ జరిపేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు… కేసీఆర్ పీఏకు నోటీసులిచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

అయితే, వయసు దృష్ట్యా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు విచారణకు కేసీఆర్ రావాల్సిన అవసరం లేదని సిట్ అధికారులు తెలిపారు. 65 ఏళ్లు పైబడిన వారు పోలీస్ స్టేషన్ కు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సిన అవసరం లేదని సీఆర్పీసీ 160 చట్టంలో ఉందని, కాబట్టి కేసీఆర్ కోరుకున్న చోట విచారణ జరుపుతామని సిట్ అధికారులు తెలిపారు.

అయితే, ఆ ప్రదేశం హైదరాబాద్ నగర పరిధిలో ఉండాలని పేర్కొంది. కేసీఆర్ ఎక్కడ విచారణ జరగాలని కోరుకుంటున్నారో అన్న విషయాన్ని తమకు ముందస్తుగా తెలియజేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. హైదరబాద్ నగర పరిధిలో అని అన్నారు కాబట్టి నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరిగే అవకాశముంది.