‘దాదా’ మృతిపై ‘దీదీ’ కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందిన వార్తతో మహారాష్ట్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అజిత్ దాదా మరణ వార్త విని ఆయన అనుచరులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

అజిత్ పవార్ మృతి పట్ల ప్రధాని మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో అజిత్ పవార్ మృతిపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

అజిత్ పవార్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన దీదీ…ఆ ప్రమాదం పట్ల కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు వేరే దర్యాప్తు సంస్థల మీద నమ్మకం లేదని అన్నారు. అజిత్ పవార్ మృతిపై సుప్రీంకోర్టు నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టుపై మాత్రమే తమకు నమ్మకం ఉందని అన్నారు.

అంతేకాదు, ఆ కమిటీ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నివేదికను సమర్పించాలని కోరారు. దీదీతోపాటు బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, పలువురు కాంగ్రెస్ నేతలు కూడా దర్యాప్తు కోసం కమిటీని నియమించాలని కోరారు.

అయితే, మహాయుతి కూటమి నుంచి అజిత్ పవార్ బయటకు రావాలనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. తన పెద్దనాన్న శరద్ పవార్‌తో తిరిగి కలిసిపోయేందుకు అజిత్ దాదా ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఈ ఘటనపై పక్కాగా సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని దీదీ, లాలూ తదితరులు డిమాండ్ చేస్తున్నారు.

కాగా, తమ విమానంలో ఎటువంటి లోపం లేదని , పొగమంచు వల్లే ల్యాండింగ్ లో ఇబ్బంది వచ్చి ప్రమాదం జరిగి ఉంటుందని ఆ విమానాన్ని ఆపరేట్ చేస్తున్న వీఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చెబుతోంది.