అధికార వికేంద్రీకరణ కోసం మూడు రాజధానుల ప్రతిపాదనలకు మద్దతివ్వాలంటూ జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా తో దాదాపు గంటపాటు భేటీ అయిన జగన్ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇందుకు అనుగుణంగా నోటిఫికేషన్ జారీచేయాలని విజ్ఞప్తి చేయటం గమనార్హం. ఎందుకంటే ఇప్పటివరకు మూడు రాజధానుల ప్రతిపాదన అన్నది రాష్ట్రపరిధిలోనే నలుగుతోంది. ప్రభుత్వ ప్రతిపాదనకు అనుకూలంగా వ్యతిరేకంగా రాజకీయపార్టీల్లోను, న్యాయస్ధానాల్లోను అనేక వివాదాలు రేగుతున్న విషయం తెలిసిందే.
మొదటిసారిగా మూడు రాజధానులకు మద్దతు ఇవ్వాలంటూ జగన్ కేంద్రాన్ని కోరారు. ఇందులో భాగంగానే హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు రీ లొకేషన్‌ను ఆమోదిస్తు నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. మూడు రాజధానుల ఏర్పాటు అవసరం ఏమిటి ? శాసనరాజధానిగా అమరావతి, పరిపాలనా రాజధానిగా వైజాగ్ ను ఎందుకు నిర్ణయించామనే విషయాలను జగన్ కేంద్ర హోంశాఖ మంత్రికి వివరించారు. కాబట్టి తమ ప్రతిపాదనలకు మద్దతివ్వాలని కోరటం ఇదే మొదటిసారి.
ఇదే సమయంలో రాష్ట్ర రాజధాని విషయంలో తాము జోక్యం చేసుకునేది లేదంటు గతంలోనే కేంద్రం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లను కూడా జగన్ ప్రస్తావించారట. కాబట్టి తమ ప్రతిపాదనలకు వీలైనంత తొందరగా ఆమోదముద్ర వేయాలని జగన్ అమిత్ ను కోరినట్లు సమాచారం. బీజేపీ మ్యానిఫెస్టోలో కూడా పేర్కొన్నట్టు… హైకోర్టు నోటిఫికేషన్ ఇస్తే కర్నూలుకు హైకోర్టు తరలింపు ఏర్పాట్లు వెంటనే ప్రారంభిస్తామని కూడా జగన్ చెప్పారట.
పనిలోపనిగా పోలవరంపై సవరించిన రూ 55,656 కోట్ల అంచనాలను ఆమోదించమని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు చెప్పాలని, రాష్ట్రానికి రావాల్సిన సుమారు రూ. 15 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. టైం డిలే అయ్యేకొద్దీ పోలవరం అంచనాలు పెరిగిపోతాయన్న విషయాన్ని జగన్ వివరించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని, కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు కేంద్రమార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర సిద్దంగా ఉన్నట్లు కూడా జగన్ చెప్పారు. మొత్తంమీద అమిత్ తో భేటి సందర్భంగా జగన్ కీలకమైన ప్రతిపాదనలే పెట్టినట్లు అర్ధమవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates