మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్, ఆయన సోదరుడిని ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 85 రోజులకు పైగా విజయవాడ జైలులో ఉన్న జోగి బ్రదర్స్ కు ఈ రోజు బెయిల్ మంజూరైంది. అనంతరం మీడియాతో మాట్లాడిన జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దమ్ముంటే బెజవాడ దుర్గమ్మ సాక్షిగా సత్య ప్రమాణం చేసేందుకు రావాలని చంద్రబాబు, లోకేశ్ లకు జోగి రమేశ్ మరోసారి సవాల్ విసిరారు. వారం రోజులు టైమ్ ఇస్తున్నానని డెడ్ లైన్ పెట్టారు.
దమ్ముంటే సీబీఐ ఎంక్వైరీ వేయాలని చెప్పానని, లై డిటెక్టర్ పరీక్షలు చేయమని చెప్పానని, తిరుమలలో ప్రమాణం చేస్తానని చెప్పానని అన్నారు. రాక్షసానందం పొందేందుకే తనను అరెస్ట్ చేయించారని, 3 నెలల పాటు మూడు జైళ్లలో తిప్పారని చెప్పారు.
అయినా తాను భయపడబోనని అన్నారు. తనకు సంబంధం లేని కేసులో అన్యాయంగా ఇరికించి అరెస్టు చేశారని, చంద్రబాబు కనుసన్నల్లో సిట్ అధికారులు విచారణ జరిపారని ఆరోపించారు.
రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని, ఇకపై పూర్తిగా ప్రజల్లోనే ఉంటానని అన్నారు. ప్రభుత్వ మోసాలను ఎండగడతానని, లోకేష్ రెడ్ బుక్ కు భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చే వరకూ, జగన్ ను మరోసారి సీఎం చేసేవరకు పోరాడతానని అన్నారు. ఇక్కడ ఆసుపత్రుల్లో మందులు లేక జనం ప్రాణాలు పోతుంటే..వారు దావోస్ వెళ్లి సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates