కవిత ‘పీకే’ మంత్రం ఫలిస్తుందా?

సొంత పార్టీ పెట్టుకుంటాన‌ని ప్ర‌క‌టించిన బీఆర్ ఎస్ మాజీ నాయ‌కురాలు, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత‌.. తన పార్టీకి సంబంధించిన ప‌నిని ప్రారంభించేశారు. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఇదేస‌మ‌యంలో పార్టీని ఏవిధంగా ముందుకు తీసుకువెళ్లాలి.. ఎలాంటి అడుగులు వేయాలి… ప్ర‌జ‌ల నాడి ఎలా ఉంది? అనే అంశాల‌పై రాజ‌కీయ మాజీ వ్యూహ‌క‌ర్త‌.. ప్ర‌శాంత్ కిషోర్ నుంచి ఆమె స‌ల‌హాలు తీసుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే రెండు సార్లు వీరి మ‌ధ్య‌చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. తెలంగాణ అస్తిత్వాన్ని, ప్ర‌జ‌ల సెంటిమెంటును త‌న రాజ‌కీయ‌పార్టీకి ప్ర‌ధాన పునాదులుగా భావిస్తున్న క‌విత‌.. వాటినే ఇప్పుడు ఆలంబ‌న‌గా చేసుకుని వ్యూహాత్మ‌క అడుగులు వేసే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. ముఖ్యంగా వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి పార్టీని క్షేత్ర‌స్థాయిలో పుంజుకునేలా చేయాల‌న్న‌ది ఆమె ప్ర‌ధాన సంక‌ల్పంగా ఉంది. కానీ, ప్ర‌స్తుతం ఆమె వ్య‌క్తిగ‌తంగా ఇమేజ్ కంటే కూడా.. కేసీఆర్‌కుమార్తెగానే గుర్తింపు తెచ్చుకున్నారు.

గ్రామాల్లో అయినా.. న‌గ‌రాల్లో అయినా.. క‌విత‌కు ఉన్న ఏకైక గుర్తింపు కేసీఆర్‌. ఆయ‌న కుమార్తె గానే తెలంగాణ స‌మాజం ఆమెను ఆద‌రిస్తోంది. అయితే.. రేపు పార్టీ పెట్టుకున్నాక కూడా ఇదే గుర్తింపు కొనసాగించాల‌ని ఆమెకోరుకోవ‌డం లేదు. ఇప్ప‌టికే జెండా స‌హా .. పేరులోనూ కేసీఆర్‌ను తీసేశారు. తెలంగాణ జాగృతి సంస్థ‌నే పార్టీగా మార్చుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే పీకేతో ఆమె సంప్ర‌దింపులు చేస్తున్నారు. అయితే.. పీకే ఎలాంటి స‌ల‌హాలు ఇస్తారు.. అనేది చూడాలి.

విఫ‌ల నేత‌!

ఇక‌, ప్ర‌శాంతి కిషోర్‌.. వ్య‌క్తిగ‌త విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న విఫ‌ల‌నాయ‌కుడిగా పేరొందారు. బీహార్‌లో ఆయ‌న పార్టీ పెట్టి.. పాద‌యాత్ర చేశారు. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో క‌నీసంలో క‌నీసం 50 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంటాన‌ని చెప్పారు. కానీ, సాధించ‌లేక పోయారు. పైగా.. ఎవ‌రూ డిపాజిట్ కూడా ద‌క్కించుకోలేక పోయారు. ఇలాంటి నేప‌థ్యంలో విఫ‌ల నేత‌తో క‌విత ప్ర‌యాణం అనే చ‌ర్చ కూడా సాగుతోంది. ఇది ఏమేరకు ఆమెకు ప్ల‌స్ అవుతుంది? మైన‌స్ అవుతుంది? అనేది కూడా చూడాలి.