గెలిస్తే సిటీ బస్సుల్లో పురుషులకు ఉచిత ప్రయాణం

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఆకర్షణీయమైన హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి పెరుగుతున్న నేపథ్యంలో అన్నాడీఎంకే తొలి దఫా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. పార్టీ నేత ఎడప్పాడి కే. పళనిస్వామి ఐదు ప్రధాన హామీలతో మేనిఫెస్టోను ప్రకటించారు.

మేనిఫెస్టోలో భాగంగా సిటీ బస్సుల్లో పురుషులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కీలక హామీ ఇచ్చింది. ప్రస్తుతం అమలులో ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని కొనసాగిస్తామని, అలాగే మహిళలకు నెలకు రెండు వేల రూపాయలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని తెలిపింది.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రస్తుతం భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతోంది. ప్రధానంగా తమిళనాడు (విడియల్ పయనం), కర్ణాటక (శక్తి పథకం), తెలంగాణ (మహాలక్ష్మి పథకం), ఢిల్లీ రాష్ట్రాల్లో మహిళలు ప్రభుత్వ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు.

వీటితో పాటు పంజాబ్ ప్రభుత్వం కూడా ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఏపీలో స్త్రీ శక్తి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పుడు తమిళనాడు సిటీ బస్సులో పురుషులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పడం ఎంతవరకు ఓటర్లపై ప్రభావం పడుతుందో చూడాలి.

తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. వివిధ రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటర్ల తుది జాబితా ఫిబ్రవరి 17న విడుదల కానుండగా, ఎన్నికల ప్రక్రియ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.