ఆదీవాసీ సమాజానికి ఐకాన్‌గా కనిపిస్తున్న ఏకైక నాయకుడు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఆదివాసీలు(గిరిజనులు) నివసిస్తున్న గ్రామాలు, తండాలకు రహదారి సౌకర్యం కల్పించడంతో పాటు విద్యుత్ వెలుగులు కూడా తీసుకువస్తున్నారు. ఆయా పనులను ప్రత్యక్షంగా ఆయన పరిశీలిస్తున్నారు. అంతేకాదు.. పండుగలు, శుభకార్యాలను దృష్టిలో పెట్టుకుని వారికి పండ్లు, చెప్పులు.. ఇతరత్రా వస్తువులను కూడా పంపిణీ చేస్తున్నారు.
దీంతో ఆదివాసీ జనాలకు ఇప్పుడు పవన్ కల్యాణ్.. పెద్దదిక్కుగా మారిపోయారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గోపాల రాయుడు పేట పంచాయతీలోన సుమారు 150 గిరిజన కుటుంబాల వారు.. “పవన్ కల్యాణ్‌గారూ మీరే మాకు దిక్కు“ అంటూ.. తమ సమస్యలను ప్రస్తావించారు. అయితే.. సాధారణంగా సమస్యలు చెబితే.. ఆయన చెంతకు చేరవేమో.. మీడియాలో హైలెట్ కావేమో అనుకున్నట్టుగా ఉన్నారు. అందుకే.. ఈ విన్నపాలను వినూత్నంగావినిపించారు.
ఆదివాసీ మహిళలు, యువకులు.. పెద్దలు.. అందరూ మెడలో ఉరితాడు బిగించుకుని.. చేతిలో పవన్ కల్యాణ్ ఫొటోలు పట్టుకుని.. అయ్యా పవన్ కల్యాణ్‌గారూ.. మీరే మాకు దిక్కు అంటూ.. నినాదాలు చేయడం గమనార్హం. తాజాగా దీనికి సంబంధించి వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్ని దశాబ్దాలుగా తాము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని.. వాటిని పరిష్కరించాలని వారు కోరుతున్నారు. అంతేకాదు.. మీరు పరిష్కరించకపోతే.. మాకు చావే దిక్కు అంటూ వారు చెప్పడం గమనార్హం.
డిమాండ్లు ఇవీ..
+ కరెంటు సదుపాయం కల్పించాలి
+ తమ గ్రామాలను పంచాయతీలో కలపాలి
+ తమ సమస్యలు పరిష్కరించేందుకు అధికారులను పంపించాలి.
+ భద్రత కల్పించాలి. తమ గ్రామాలను అభివృద్ధి చేయాలి.
+ రహదారి సౌకర్యం కల్పించాలి.
+ ఐదు గ్రామాల్లోనూ పాఠశాల, రోడ్లు, విద్యుత్ కల్పించాలి.
+ తమకు ఆధార్ కార్డులు ఇప్పించాలి.
ఇవీ.. గ్రామాలు..
1) కృపా వలస
2) రమణ వలస
3) దీవెన వలస
4) సియోన్ వలస
5) చిన్నాకిర వలస
Gulte Telugu Telugu Political and Movie News Updates