వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తరచుగా జగన్ మళ్లీ వస్తే అనే మాట ప్రస్తావిస్తున్నారు. మళ్లీ రానివ్వొద్దంటూ చంద్రబాబు ప్రజలకు చెబుతున్నారు. ఇక వైసీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి అధికారంలోకి రాకుండా చేస్తానని పవన్ కళ్యాణ్ కూడా స్పష్టం చేస్తున్నారు. కూటమిని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తనకు తెలుసని వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే వీరిద్దరూ ఇంతగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, జగన్ వైఖరిని గమనిస్తున్న వారు మాత్రం ఇక అంత కష్టపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే జగన్ తన రాజకీయ గ్రాఫ్‌ను తానే తగ్గించుకుంటున్నారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా కీలకమైన రాజధాని అంశంలో చేసిన తప్పులకు ఆయనే మూల్యం చెల్లించుకుంటున్నారు. గుంటూరు, విజయవాడ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీనికి ప్రధాన కారణం అమరావతి అంశమేనని పార్టీ నేతలకే తెలిసినా, జగన్ మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి.
నిజానికి చంద్రబాబు అయినా, ఇతర నాయకులు అయినా తప్పులు జరిగితే వాటిని సరిదిద్దుకుంటున్నారు. 2018కి ముందు ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పిన చంద్రబాబు, తర్వాత ప్రజల్లో తన గ్రాఫ్ తగ్గుతోందని గ్రహించి వెంటనే దిశ మార్చుకున్నారు. కేంద్రంతో పోరాటానికి దిగారు. అది ఫలితమిచ్చిందా లేదా అన్నది పక్కన పెడితే, ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడిన విషయం వాస్తవం. ఆ తర్వాత రాజకీయ అవసరాలు గుర్తించి మళ్లీ బీజేపీతో చేతులు కలిపి అధికారంలోకి వచ్చారు.
అంటే రాజకీయాల్లో తప్పులు చేసినా వాటిని సరిదిద్దుకోవడం నాయకులకి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం. కానీ ఈ తరహా వ్యూహం, తప్పులు ఒప్పుకుని మారే గుణం జగన్‌లో ఎక్కడా కనిపించడం లేదన్నది ప్రధాన విమర్శ. పైగా తాను చేసిందే సరైనదన్న భావనతోనే ఆయన కొనసాగుతున్నారు. అందుకే మరోసారి అమరావతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ అన్నింటిని గమనించిన తర్వాత, జగన్ ఇక మారడు అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా పాతుకుపోతోంది. దాంతో కొంతమేర ఉన్న సానుభూతి కూడా క్రమంగా తగ్గిపోతోంది. ఈ పరిస్థితిని బట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు జగన్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates