`పీపీపీ`కి కేంద్రం అండ‌… బాబుకు భ‌రోసా… !

ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే కృష్ణా నదిపై రిసార్టుల ఏర్పాటు తేలియాడే పర్యాటక బోట్ల ఏర్పాటు విషయాన్ని ఆయన సీరియస్గా పరిశీలిస్తున్నారు. అయితే పిపిపి విధానంలో అంతా ప్రైవేటుకు అప్పజెప్పేస్తున్నారని దీనిలో ప్రభుత్వ భాగస్వామ్యం ఉండదని చెబుతూ ప్రతిపక్షం వైసిపి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తోంది. నిరసన నిర్వహిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కోటి సంతకాల సేకరణ కూడా చేపట్టింది. ముఖ్యంగా మెడికల్ కాలేజీలను ప్రవేటుకు అప్పచెప్తే పేదలకు ఉచిత వైద్య సేవలు దూరం అవుతాయి అన్నది వైసీపీ చెబుతున్న మాట. ఈ క్రమంలోనే పీపీపీ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే ఈ విషయంలో ముందుకే వెళ్తానని సీఎం చంద్రబాబు చెప్తున్నారు. ఈ క్రమంలోనే వైద్య కళాశాలలకు ఆయన పిపిపి విధానాన్ని ఎంచుకున్నారు. ఈ విషయంపై మరింత ఉద్యమం లేవనెత్తాలని వైసిపి భావిస్తోంది.

ఇలాంటి సమయంలో సీఎం చంద్రబాబు.. ఈ విష‌యాన్ని కేంద్రానికి చెప్పారు. పీపీపీ విధానంపై కేంద్రం వైఖరి ఏంటి అనేది ఆయన తాజాగా ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు వివరించారు. ఈ క్రమంలో పీపీపీ విధానాన్ని కేంద్రం కూడా ప్రోత్సహిస్తుందని దీనిలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని కేంద్రం నుంచి చంద్రబాబుకు బలమైన భరోసా లభించింది. మరోవైపు జాతీయ వైద్య మండలి ఉన్నతాధికారులు కూడా పిపిపి విధానాన్ని సమర్ధించారు.

రాష్ట్రంలో పర్యటించిన కీలక అధికారి పీపీపీ విధానాన్ని సమర్ధిస్తూ ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటుందని నిర్వహణ మొత్తం ప్రభుత్వమే చేస్తుందని చెప్పారు. పేదలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని పైగా ఉచితంతో పాటు రాయితీ వైద్యం కూడా అందుతుందని చెప్పుకు రావడం విశేషం. సో మొత్తంగా చూస్తే చంద్రబాబుకు పిపిపి విషయంలో అటు కేంద్రం నుంచి ఇటు అధికారుల వ‌ర‌కు అదే విధంగా కీలక సంస్థల నుంచి కూడా మద్దతు లభిస్తుందట విశేషం.

దీనిపై వైసీపీ ఎలాంటి అడుగులు వేస్తుంది అనేది ఆసక్తికర విషయం. మరోవైపు హైకోర్టులో పిపిపి వ్యవహారంపై ఇప్పటికే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిని విచారణకు స్వీకరించిన హైకోర్టు కూడా పిపిపి విధానాన్ని సమర్ధించింది. కానీ విచారణలో ఉన్న నేపథ్యంలో చివరికి ఎలాంటి తీర్పిస్తుంది అనేది చూడాలి. ఏదేమైనప్పటికీ పీపీపీ విధానంపై ప్రభుత్వానికి అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తుండడం విశేషం.