తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో మంది సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చి, అనేక కష్టాలు భరిస్తూ శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి పవిత్ర ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని వైసీపీ రాజకీయాలు చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది.
వైసీపీ పాలన సమయంలో కల్తీ నెయ్యి, పరాకామణి దొంగతనం వంటి ఘటనలు జరిగాయని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా తిరుమలను కేంద్రంగా చేసుకుని వివాదాలు సృష్టించి, వాటిని కూటమి ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం జరుగుతోందని వారు అంటున్నారు. ఇటీవల తిరుమలలోని గెస్ట్ హౌస్‌లు, భక్తులు నివసించే ప్రాంతాల్లో మద్యం సీసాలు కనిపించడం పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనను వైసీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా పెద్దది చేసి ప్రచారం చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే, ఈ వ్యవహారం వెనుక అసలు నిజం ఏమిటో తాజాగా పోలీసుల దర్యాప్తులో బయటపడిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీకి చెందిన కార్యకర్తలే ఖాళీ మద్యం సీసాలను తిరుమలకు తీసుకువచ్చి ఆయా ప్రాంతాల్లో వెదజల్లారని, అనంతరం వైసీపీ అనుకూల మీడియాకు చెందిన వ్యక్తులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని పోలీసులు తేల్చినట్లు టీడీపీ పేర్కొంటోంది.
దీనివెనుక తిరుమల పవిత్రతను దెబ్బతీయడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే కుట్ర ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. తిరుమలలో భద్రతా వైఫల్యం ఉందన్న తప్పుడు భావన కల్పించి రాజకీయ లబ్ధి పొందాలన్నదే వైసీపీ లక్ష్యమని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసమేనా?
పవిత్రమైన తిరుమలను రాజకీయాల కోసం వాడుకోవడం అత్యంత దురదృష్టకరమని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమలను కాపాడుతున్నామని ప్రభుత్వం చెబుతుంటే, వాటిని అపవిత్రం చేసే ప్రయత్నాలు కావాలని జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తిరుమల పవిత్రతతో చెలగాటం ఆడితే ఊరుకోబోమని టీడీపీ స్పష్టం చేస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates