‘తెలంగాణ ప్రాజెక్టులకు టీడీపీ అడ్డు చెప్పలేదు’

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల రాజ‌కీయాలు వ‌ద్ద‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు సూచించారు. రెండురాష్ట్రాల‌కూ నీటి స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని.. అదేవిధంగా ప్రాజెక్టుల నిర్మాణాలు కూడా సాగుతున్నాయ‌ని తెలిపారు. ఇలాంటి స‌మ‌యంలో అన‌వ‌స‌ర రాజ‌కీ యాలు చేసుకుని.. ప్ర‌జ‌లను క‌న్య్ఫూజ్ చేయొద్ద‌ని ఆయ‌న కోరారు.

పోల‌వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించిన ఆయ‌న‌.. అనంత‌రం.. మీడియాతో మాట్లాడారు. ఇటీవ‌ల తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్య‌లు.. ద‌రిమిలా రాజ‌కీయంగా ప‌లు పార్టీల‌కు చెందిన నేత‌లు.. చేసిన వ్యాఖ్య‌ల‌ను ప‌రోక్షంగా ఆయ‌న ప్ర‌స్తావించారు.

పోల‌వ‌రం-న‌ల్ల‌మ‌ల సాగ‌ర్ ప్రాజెక్టు ద్వారా స‌ముద్రంలోకి వృథాగా క‌లుస్తున్న నీటిని వినియోగించుకోవాలన్న‌దే ల‌క్ష్య‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. దీనికి అడ్డు ప‌డ‌డం స‌రికాద‌న్నారు. స‌ముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని వాడుకుంటే.. రెండు రాష్ట్రాల‌కు కూడా మంచిదేన‌న్నారు.

ఎవ‌రైనా ఈ నీటిని వాడుకోవ‌చ్చ‌న్నారు. రాజ‌కీయాలు ఎక్క‌డ చేయాలో అక్క‌డే చేయాల‌ని జ‌లాల‌పై రాజ‌కీయాలు చేయ‌డం స‌రికాద‌ని వ్యాఖ్యానించారు. ఈ విష‌యంలో నేత‌లు పోటీ ప‌డి కామెంట్లు చేయ‌డాన్ని ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు సుభిక్షంగా ఉండాలంటే.. ఇరు రాష్ట్రాలు స‌ర్దుబాటు ధోర‌ణిలోనే ముందుకు సాగాల్సి ఉంటుంద‌న్నారు.

ప్ర‌జ‌ల భావోద్వేగాల‌తో ఆడుకోవ‌డం స‌రికాద‌ని సూచించారు. కొంద‌రు ఈ వివాదాల‌ను రాజ‌కీయాల కోసం వాడుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని.. ఇది స‌రికాద‌న్నారు. తెలంగాణ ప్రాజెక్టుల‌కు టీడీపీ ఎప్పుడూ అడ్డు చెప్ప‌లేద‌న్నారు. దేవాదుల నుంచి క‌ల్వ‌కుర్తి వ‌ర‌కు .. చాలా ప్రాజెక్టుల‌ను త‌న హ‌యాంలోనే ప్రారంభించిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు.

కావాలంటే..దేవాదుల‌ను మ‌రింత‌గా ముందుకు తీసుకువెళ్లాల‌ని సూచించారు. గోదావ‌రిలోనే నీళ్లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని.. దీనిని స‌ద్వినియోగం చేసుకునేందుకు రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ల‌సి క‌ట్టుగా ఉంటే రెండు రాష్ట్రాల‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు.

కృష్ణాన‌దిలో నీటి ల‌భ్య‌త‌ త‌క్కువ‌గా ఉన్నందున‌.. దీనిపై ఎన్ని ప్రాజెక్టులు క‌ట్టినా.. స‌మ‌యం వృథా అవుతుంద‌న్నారు. ఇరు రాష్ట్రాలు స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగితే.. నీటి స‌మ‌స్య తీరుతుంద‌న్నారు. దేవాదుల ద్వారా నీటిని పొదుపు చేసుకుంటే తెలంగాణ‌కు మంచి జ‌రుగుతుంద‌న్నారు.

పోల‌వ‌రానికి వ‌చ్చే నీటిని ఆపేయ‌డం ద్వారా ఎవ‌రికీ ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని తేల్చి చెప్పారు. తాను ఎప్పుడూ రెండు తెలుగు రాష్ట్రాల మేలు కోస‌మే ప‌నులు చేస్తున్నాన‌ని తెలిపారు. పోల‌వ‌రం-న‌ల్ల‌మ‌ల సాగ‌ర్ ద్వారా గోదావ‌రి జలాల‌ను నిల్వ చేస్తే.. అది తెలంగాణ‌కు కూడా ఉప‌యోగ‌మే క‌దా అని వ్యాఖ్యానించారు.