రాయలసీమను రత్నాల సీమ చేస్తామని ఒకరు, రాయలసీమ కష్టాలు నావి, నేను వాటిని పరిష్కరిస్తానని మరొకరు… ఇలా ఏపీలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఇద్దరూ సీమ సమస్యలపై స్పందిస్తూనే ఉన్నారు. కానీ సీమ సమస్యలు మాత్రం ముందుకు సాగడం లేదు.
ఒకటి కాదు, రెండు కాదు… అనేక ప్రాజెక్టులు మూలనపడ్డాయి. గాలేరు నగరి ప్రాజెక్టును పూర్తి చేస్తే లక్ష ఎకరాలకు నీరు అందుతుంది. ఈ విషయంలో కూడా ప్రభుత్వాలు ఉదాసీనంగానే ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదేసమయంలో, పూర్తి కాని ప్రాజెక్టులను భుజాన వేసుకుని ప్రజలను ప్రకటనలతో మురిపిస్తున్నారన్న వాదన కూడా ఉంది. ఈ క్రమంలో సీమ సెంటిమెంటును పట్టుకునే విషయంలో రాజకీయ నాయకులు విఫలమవుతున్నారా అన్న ప్రశ్న తలెత్తుతోంది.
వాస్తవానికి భారీ ప్రాజెక్టులు చేపట్టకపోయినా ఫర్వాలేదని, కనీసం ఉన్న ప్రాజెక్టులను అయినా పూర్తి చేయాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. వలసలు లేని సీమ గ్రామాలు కావాలని అంటున్నారు.
ఈ నేపథ్యంలో సీమ సెంటిమెంటును గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం పార్టీలపై ఉంది. కర్నూలు జిల్లా కోసిగి సహా అనేక ప్రాంతాల్లో ఏటా ఎనిమిది నెలల పాటు జనాలు ఉండరంటే ఆశ్చర్యమే. నంద్యాలలో రైతుల దుస్థితి కూడా ఇలాగే ఉందంటే విస్మయం కలుగుతుంది.
తక్షణ అవసరంగా రైతులకు అవసరమైన చిన్నపాటి ప్రాజెక్టులను పూర్తి చేస్తే నీరు వచ్చి రైతులు ఆనందిస్తారు. కానీ ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు. వైసీపీ అయినా, టీడీపీ అయినా భారీ ప్రాజెక్టులకే మొగ్గు చూపుతున్నాయి.
ఇక తుంగభద్ర నుంచి వచ్చే నీటిపై కర్ణాటక పెత్తనం పెరుగుతోంది. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం ఆల్మట్టి రిజర్వాయర్ ఎత్తును పెంచుతోంది. ఈ సమస్యలను ముందుగా పరిష్కరించాలని సీమ ప్రజలు కోరుతున్నారు.
ఇవి పరిష్కరిస్తే ప్రస్తుతం బీళ్లుగా మారుతున్న పొలాలకు నీరు చేరుతుందని, దాంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వారు అంటున్నారు. ఈ దిశగా నిజమైన ప్రయత్నం చేస్తే సీమ సెంటిమెంటును పార్టీలు నిజంగా అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates