ఏపీకి రానున్న ధోనీ.. సీఎంతో భేటీకి కారణం?

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. ఈ నెల 9వ తేదీన ఆయన అమరావతికి చేరుకునే అవకాశముందని తెలుస్తోంది. ఈ సందర్భంగా ధోనీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు..ఈ సమావేశంలో రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, యువ క్రీడాకారులకు శిక్షణ అవకాశాల విస్తరణపై చర్చ జరిగే అవకాశముంది. ముఖ్యంగా క్రికెట్ అకాడమీ ఏర్పాటుపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

ధోనీ పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ అకాడమీ ఏర్పాటు అంశం మళ్లీ చర్చకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గత పాలన సమయంలో 2018లో విశాఖపట్నంలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు కోసం కుదిరిన అవగాహన ఒప్పందం ఇప్పుడు తిరిగి అమలులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారత జట్టుకు నాయకత్వం వహించి మూడు ప్రధాన ఐసీసీ ట్రోఫీలను అందించిన ధోనీ ప్రస్తుతం నాగ్‌పూర్, ఖతార్ వంటి ప్రాంతాల్లో క్రికెట్ అకాడమీలను నిర్వహిస్తున్నారు. క్రీడల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించాలనే లక్ష్యంతో ధోనీతో భాగస్వామ్యం కుదుర్చుకునే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఇదే సమయంలో 2027 జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు సాగుతున్న నేపథ్యంలో, ప్రతిపాదిత క్రికెట్ అకాడమీ రాష్ట్ర క్రీడా రంగానికి కీలకంగా మారనుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.