మండలిలో కవిత మంగమ్మ శపథం!

బీఆర్‌ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత సోమవారం సంచలన ప్రకటన చేశారు. మండలిలో మాట్లాడిన ఆమె, తెలంగాణ ఉద్యమానికి ముందే ప్రారంభించిన తెలంగాణ జాగృతిని త్వరలోనే రాజకీయ పార్టీగా మారుస్తామని ప్రకటించారు. తెలంగాణ జాగృతి ఇక నుంచి రాజకీయ పార్టీగా మారుతుందన్నారు. దీనిని ప్రజలకు చేరువ చేస్తామని తెలిపారు.

ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు, తెలంగాణ సిద్ధాంతాలకు అనుగుణంగా తమ పార్టీ పనిచేస్తుందన్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో వీర మరణం పొందిన కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీతో తనకు ఉన్నది ఆస్తుల పంచాయతీ కాదని, ఆత్మగౌరవం కోసమే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్టు వివరించారు.

ప్రస్తుతం తాను వ్యక్తిగానే ఉన్నానని కవిత చెప్పారు. అయితే త్వరలోనే రాజకీయ శక్తిగా మారుతానని, అప్పుడే సభలో అడుగు పెడతానని శపథం చేశారు.
నేను ఇప్పుడు వ్యక్తిగా సభ నుంచి బయటకు వెళ్తున్నా. కానీ వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని రాజకీయ శక్తిగా సభలో అడుగు పెడతా. ఇది ఖాయం అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజలకు తమ పార్టీని చేరువ చేయనున్నట్టు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో పార్టీ ఒక శక్తిగా మారుతుందన్నారు.

సెంటిమెంట్

ఈ సందర్భంగా కవిత సెంటిమెంట్‌ను రాజేశారు.

మండలిలో కన్నీరు పెట్టుకున్నారు. బీఆర్‌ఎస్ నాయకులు తనను తీవ్రంగా అవమానించారని చెప్పారు.

తన పుట్టింటితోనూ బంధాలు తెంచుకుని, ప్రజల కోసం పార్టీ పెడుతున్నానని, దీనిని ప్రజలు ఆశీర్వదించాలని ఆమె కోరారు.

ఇక సభకు వచ్చేది లేదని, తన రాజీనామాను ఆమోదించాలని మరోసారి మండలి చైర్మన్‌ను ఆమె కోరారు.