‘తెలుగు రాష్ట్రాల మధ్య ఉండాల్సింది ద్వేషం కాదు’

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పేరిట విద్వేషాలు పెంచుకోవడం సరికాదని, పరస్పర సయోధ్యతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు వేదికగా నిర్వహించిన మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు పెంచుకోవడం సరికాదని, సయోధ్యతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్ తరాల కోసం ఐక్యతతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. జల వివాదాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

గోదావరి జలాలను వినియోగించుకోవడంపై తెలంగాణకు తాను ఎప్పుడూ అడ్డు చెప్పలేదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పుడు కూడా నీళ్లు వస్తాయని భావించానన్నారు.

గంగా–కావేరి నదులు అనుసంధానమైతే దేశం మొత్తం సస్యశ్యామలంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సుమారు మూడు వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోతోందని గుర్తుచేశారు.

కృష్ణా డెల్టా అభివృద్ధి పేరుతో తెలంగాణకు నీటిని అందించామని, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టెంపాడు ప్రాజెక్టులను కృష్ణా నదిపై తానే పూర్తి చేసినట్టు తెలిపారు. కృష్ణా డెల్టా మోడరైజేషన్‌లో భాగంగా 20 టీఎంసీల నీటిని తెలంగాణకు కేటాయించి బీమా లిఫ్ట్ ఇరిగేషన్‌ను కూడా పూర్తి చేశామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి పరస్పర సహకారంతోనే సాధ్యమని సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు.