మండలిలో కవిత కన్నీటిపర్యంతం

తెలంగాణ శాసనమండలిలో బీఆర్‌ఎస్‌ పార్టీపై కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ తీరు, నాయకత్వ వైఖరిపై ఆవేదన వ్యక్తం చేసిన ఆమె, సభలో భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. గత ఎనిమిదేళ్లుగా ప్రజల కోసం చేసిన తన ప్రయత్నాలను అడ్డుకున్నారని, పార్టీకి అనుకూలంగా ఉన్న ఛానెళ్లు, పత్రికలు కూడా తనకు మద్దతుగా నిలవలేదని ఆరోపించారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ తనను ఘోరంగా అవమానించిందని కవిత పేర్కొన్నారు. పార్టీలో అంతర్గత గౌరవం లేకుంటే ఎలా కొనసాగాలని ప్రశ్నించారు. దురాగతాలపై బీఆర్‌ఎస్‌ అధిష్టానానికి పలుమార్లు విన్నవించినా ఎలాంటి ఫలితం లేదన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ పేరు మార్పునకు తాను ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌పై కక్షతోనే బీజేపీ తనను జైలుకు పంపిందని, ఈడీ, సీబీఐ కేసులపై పోరాడుతున్న సమయంలో కూడా బీఆర్‌ఎస్‌ తనకు అండగా నిలవలేదని విమర్శించారు.

అదే సమయంలో శాసనమండలిలో బీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎండగట్టడంలో కాంగ్రెస్‌ సఫలమైందని వ్యాఖ్యలు వినిపించాయి. రాజ్యాంగ స్ఫూర్తితో బీఆర్‌ఎస్‌ పనిచేయడం లేదని కవిత ఆరోపించారు. లక్ష్మీనరసింహస్వామి, తన ఇద్దరు కొడుకులపై ప్రమాణం చేసి చెబుతున్నానని, ఇది ఆస్తుల పంచాయతీ కాదు.. ఆత్మగౌరవ పంచాయతీ అని స్పష్టం చేశారు. నైతికత లేని పార్టీలో తాను ఉండదల్చుకోలేదని, అందుకే తన రాజీనామాను ఆమోదించాలని కోరుతున్నట్లు కవిత ప్రకటించారు.