ఈసారి ఎన్నికల్లో హవా ఎవరిది?

తెలంగాణ‌లో ఇటీవ‌ల పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రిగాయి. దీనిలో అధికార‌ కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది. ఇక‌, దీనికి ముందు.. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక కూడా జ‌రిగింది. దీనిలోనూ కాంగ్రెస్ పార్టీ విజ‌యం ద‌క్కించుకుంది. ఇదిలావుంటే.. తాజాగా మ‌రోసారి తెలంగాణ‌లో ఎన్నిక‌ల స‌మ‌రానికి తెర‌దీయ‌నున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 117 మునిసిపాలిటీల‌కు.. ఈ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆయా మునిసిపాలిటీల‌కు.. గ‌త ఏడాదే ఐదేళ్లు పూర్త‌య్యాయి. దీంతో ప్ర‌త్యేక అదికారుల పాల‌న సాగుతోంది. అయితే.. ఇటీవ‌ల హైకోర్టు.. ప్ర‌త్యేక అధికారుల పాల‌న‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఎన్నాళ్లు ఇలా సాగ‌దీస్తార‌ని ప్ర‌శ్నించింది.

ఈ నేప‌థ్యంలో తాజాగా 117 మునిసిపాలిటీల‌కు.. ఎన్నిక‌లు నిర్వ‌హించే దిశ‌గా రాష్ట్ర ఎన్నిక‌ల అధికారులు క‌స‌ర‌త్తు ప్రారంభించారు. ఈ నెల 20వ తేదీలోగా దీనికి సంబంధించిన నోటిఫికేష‌న్ రానుంది.

ఇవీ బ‌లాబలాలు!

ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తే.. అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ఉంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి హ‌వా కొన‌సాగుతోంద‌నే చెప్పాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో అయినా.. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో అయినా.. ఆయ‌న చెల‌రేగి ప్ర‌చారం చేశారు.

ఇక‌, ఇప్పుడు.. మునిసి ప‌ల్ ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న ఇదే ప‌ట్టును కొన‌సాగించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ముఖ్యంగా న‌గ‌రాల అభివృద్ధికి, అదేవిధంగా చెత్త సేక‌ర‌ణ స‌హా ప్రాంతీయ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న ద‌రిమిలా.. మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌ను కూడా అంతే ప్రాధాన్యంగా తీసుకునే అవ‌కాశం ఉంది.

ఇక‌, బీఆర్ ఎస్ విష‌యానికి వ‌స్తే.. జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని పార్టీ కోల్పోయింది. దీనికితోడు పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పైకి బాగానే మ‌ద్ద‌తు దారుల‌ను గెలిపించుకున్నామ‌ని చెబుతున్నా.. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో మాత్రం అసంతృప్తి ఉంది. ఈ నేప‌ధ్యంలో మున్సిపల్ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.

అయితే.. ఎన్నిక‌లు ఏవైనా కేసీఆర్ వ‌స్తే త‌ప్ప‌.. బీఆర్ ఎస్‌కు అనుకున్న విధంగా ఆశించిన విధంగా ఓట్లు రాలే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. ఇక‌, మునిసిపాలిటీల్లో పట్టు పెంచుకునేందుకు బీజేపీ నాయ‌కులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో క‌మ‌లం పార్టీ నాయ‌కులు ఏమేర‌కు చెమ‌టోడుస్తార‌న్న దానిపై ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఆధార‌ప‌డి ఉంటాయి.