ఏపీలో రాహుల్ గాంధీ నిరసన… ఎందుకు?

ఏపీకి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రానున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో భారీ నిరసనకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 2న కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్రానికి రానున్నారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని బండ్లపల్లి గ్రామంలో ఈ నిరసన సభ నిర్వహించనున్నారు.

బండ్లపల్లిని వేదికగా ఎంచుకోవడం వెనుక ప్రత్యేక రాజకీయ ప్రాధాన్యత ఉంది. 2006 ఫిబ్రవరి 2న ఇదే గ్రామంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ చేతుల మీదుగా ఉపాధి హామీ పథకం ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైన ఈ పథకం కోట్లాది గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించిందని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది.

పథకం పేరును ‘వికసిత్ భారత్ రోజ్‌గార్ – అజీవికా హామీ మిషన్’గా మార్చడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది కేవలం పేరు మార్పు కాదని, మహాత్మాగాంధీ ఆలోచనలను తొలగించే ప్రయత్నమని పార్టీ ఆరోపిస్తోంది. పథకం ప్రారంభించి 20 ఏళ్లు పూర్తవుతున్న రోజునే అదే గ్రామంలో నిరసన చేపట్టడం ద్వారా కేంద్రానికి గట్టి సందేశం ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ సభ ద్వారా భవిష్యత్తు పోరాట కార్యాచరణను ప్రకటించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.