ఉత్తరాంధ్రకు న్యూ ఇయర్ గిఫ్ట్

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఉత్తరాంధ్రకు నూతన గేమ్‌చేంజర్ కానుంది. విజయనగరం భోగాపురంలో నిర్మాణమైన అంతర్జాతీయ విమానాశ్రయం చారిత్రక ఘట్టానికి సిద్ధమవుతోంది. 2026 జనవరి 4న ఢిల్లీ నుంచి వచ్చే ఎయిర్ ఇండియా విమానం తొలి ల్యాండింగ్ కోసం వస్తోంది. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈ సందర్భంగా భోగాపురానికి విచ్చేస్తున్నారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం వేగంగా సాగుతోంది. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. రన్వే, టెర్మినల్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, భద్రతా వ్యవస్థల ఏర్పాట్లు తుది దశకు చేరాయి.

జనవరి 4న జరగనున్న ఫైనల్ ట్రయల్ రన్‌లో డీజీసీఏ, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఉన్నతాధికారులు భద్రతా ప్రమాణాలను పరిశీలించనున్నారు. మిగిలిన 5 శాతం పనులు 2026 జూన్ నాటికి పూర్తి చేసి, ఆగస్టులో ప్రయాణికుల కోసం పూర్తి స్థాయిలో ప్రారంభం కానుంది.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి, పర్యాటక రంగానికి కొత్త ఊపు ఇస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాలకు పెట్టుబడులు, కనెక్టివిటీ పెరుగుతాయి.

ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు పాల్గొని భారీ వేడుకలు జరుపుతున్నారు. కొత్త ఏడాది ప్రారంభంలోనే వాసులకు ఇది ప్రత్యేక ఆనందం కలిగించిందని ప్రజలు అభిప్రాయపడ్డారు.