జగన్ ఆపినవన్నీ బాబు తీసుకొస్తున్నారు

వైసీపీ హ‌యాంలో మాజీ సీఎం జ‌గ‌న్ చేసిన త‌ప్పులను స‌రిదిద్దుతున్న కూట‌మి ప్ర‌భుత్వం.. తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ‌తంలో పేద‌లు, రోజువారీ కార్మికుల ఆద‌ర‌ణ పొందిన అన్న‌క్యాంటీన్ల‌ను జ‌గ‌న్ వ‌చ్చిన త‌ర్వాత ఎత్తేశారు. వీటిని కూట‌మి స‌ర్కారు రాగానే గాడిలో పెట్టింది.

రాష్ట్ర వ్యాప్తంగా 237 క్యాంటీన్లు అందుబాటులోకి వ‌చ్చాయి. అదేవిధంగా విద్యుత్ చార్జీల‌ను ఎడా పెడా పెంచ‌డంతోపాటు.. సౌర విద్యుత్ ను ప్రోత్స‌హించ‌కుండా.. కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాన్ని వినియోగించుకోకుండా.. వైసీపీ ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చేసింది. దీనిని కూడా కూట‌మి స‌ర్కారు స‌రిచేసింది. ప్ర‌స్తుతం సౌర‌విద్యుత్‌కు ప్రాధాన్యం ఇస్తోంది.

అదేవిధంగా కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న 73 ప‌థ‌కాల‌ను తిరిగి ప్రారంభించి.. కేంద్రం నుంచి నిధులు తీసుకువ‌చ్చి రాష్ట్రాన్ని డెవ‌ల‌ప్ చేస్తున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా.. వైసీపీ హ‌యాంలో చేసిన జిల్లాల విభ‌జ‌న‌లో చోటు చేసుకున్న లోటుపాట్ల‌ను స‌రిదిద్ది.. కొత్త జిల్లాల‌ను, మండ‌లాల‌ను.. జిల్లా కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్నారు.

దీనిలో భాగంగా ప్ర‌స్తుతం ఉన్న 26 జిల్లాల‌ను కొత్త‌గా మ‌రో రెండు జిల్లాలు ఏర్పాటు చేయ‌డంద్వారా.. 28 జిల్లాల‌కు పెంచ‌నున్నారు. అదేవిధంగా మ‌రో 17 జిల్లాల్లో మార్పులు చేర్పులు చేయ‌డం ద్వారా ఆయా ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల మ‌నోభావాల‌కు పెద్ద పీట వేస్తున్నారు.

ఇక‌, ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో వినియోగించే విద్యుత్‌కు స్మార్ట్ మీట‌ర్ల‌ను అమ‌ర్చాల‌ని నిర్ణ‌యించారు. వాస్త‌వానికి ఇది గ‌తంలో వైసీపీ ప్ర‌భుత్వం చేయాల్సి ఉంది. కానీ.. అప్ప‌ట్లో ప్ర‌జ‌ల‌కు ప‌రిమితం చేశారు. తాజాగా దీనిని ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు కూడా అమ‌లు చేస్తున్నారు. వ‌చ్చే రెండు మాసాల్లో అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లోనూ స్మార్ట్ విద్యుత్ మీట‌ర్లు ఏర్పాటు చేస్తారు.

అలానే.. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా బీసీ జ‌నాభా తీసుకున్న రుణాల‌ను మాఫీ చేయ‌నున్నారు. ఈ రుణాల ద్వారా.. బీసీల్లోని పేద‌లు.. వివిద వ‌స్తువుల‌ను కొనుగోలు చేసి ఉపాధి మార్గాలుగా మార్చుకున్నారు. ఈ నేప‌థ్యంలో వారికి మేలు చేయాల‌ని నిర్ణ‌యించారు.

ఇక‌, పోల‌వ‌రం ప్రాజెక్టు వ్య‌వ‌హారంపై కూడా ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రాజెక్టు నిర్మిత‌మ‌వుతున్న ప‌రిసర ప్రాంతాల్లో అభివృద్ధి చేయాల‌నేది గ‌తంలోనే తీసుకున్న నిర్ణ‌యం. అయితే.. వైసీపీ హ‌యాంలో ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టారు. ఇప్పుడు దానిని కూడా పూర్తి చేయాల‌ని కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. తద్వారా.. పోల‌వ‌రం అంటే.. కేవ‌లం ప్రాజెక్టు కాద‌ని.. అభివృద్ధి న‌గ‌రంగా తీర్చిదిద్దాల‌ని భావిస్తోంది. దీంతో స్థానికుల‌కు ఉపాధి మార్గాలు కూడా ఏర్ప‌డ‌నున్నాయ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది.