ఏపీ కూటమి ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ హయాంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో భూములు రీసర్వే చేసి.. రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చారు. అయితే.. ఈ పుస్తకాలపై అప్పటి సీఎం జగన్ ఫొటోలను ముద్రించారు. ఇది పెద్ద వివాదంగా మారిన విషయం తెలిసిందే.
వాస్తవానికి ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఏదైనా వెనక్కి తగ్గాలి. కానీ.. అప్పటి సీఎం జగన్ సహా మంత్రులు.. పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటోలను ముద్రించడాన్ని సమర్థించుకున్నారు. ఇది ఎన్నికల సమయంలో వైసీపీ గ్రామస్థాయి ఓటు బ్యాంకును తుడిచి పెట్టేసింది.
ఈ నేపథ్యంలోనే ప్రజల నాడినితెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. తాము అధికారంలోకి వస్తే.. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ను రద్దు చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటోలను తీసేస్తామని కూడా చెప్పారు. ఆ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రను ముద్రిస్తామన్నారు.
దీనిపై కొన్నాళ్లుగా గ్రామస్థాయిలో రైతుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన.. 18 నెలల తర్వాత కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదని మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. వీటిని గమనించిన ప్రభుత్వం గత మూడు మాసాలుగా తీవ్ర కసరత్తు చేసింది.
ముఖ్యంగా న్యాయపరమైన వివాదాలు రాకుండా.. రైతులకు నష్టం రాకుండా కూడా సలహాలు, సూచనలు తీసుకుని తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ ఫొటోలను తొలగించాలని.. సీఎం చంద్రబాబు, మంత్రివర్గం కూడా తీర్మానించింది.
దీని ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా వేల మందికి ఇచ్చిన పాసు పుస్తకాలను వెనక్కి తీసుకుని వాటి స్థానంలో కొత్తగా పాసుపుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించింది. అదేవిధంగా రీసర్వేను తిరిగి కొనసాగించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.
కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు.. ముఖ్యంగా జగన్ ఫొటోలు తీసేసేందుకు సుమారు 50-70 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని ప్రాధమికంగా నిర్ణయించారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. ఎంత ఖర్చయినా.. ఫర్వాలేదన్నారు. ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫోటోలను తొలగిస్తామన్నారు.
భూములకు-ప్రజలకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుందని.. ఆ సెంటిమెంటు తనకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఖర్చుకు వెనుకాడవద్దని తెలిపారు. వచ్చే మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు అందించనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates