ఇక అసెంబ్లీలో… కేసీఆర్ vs రేవంత్!

బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. అసెంబ్లీకి హాజ‌రు కానున్నారా? సుదీర్ఘ‌కాలం త‌ర్వాత‌.. ఆయ‌న స‌భ‌లో త‌న గ‌ళం వినిపించ‌ను న్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. తాజాగా ఆదివారం సాయంత్రం ఆయ‌న ఎర్ర‌వ‌ల్లిలోని ఫామ్ హౌస్ నుంచి హైద‌రాబాద్‌లోని నివాసానికి చేరుకోవ‌డంతో ఈ ఊహాగానాల‌కు బ‌లం చేకూరుతోంది.

ఇటీవ‌ల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి నుంచి బ‌ల‌మైన విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డం.. అసెంబ్లీకి వ‌చ్చి చ‌ర్చించాల‌ని ఆయ‌న కోరుతున్న నేప‌థ్యంలో కేసీఆర్ ఈ దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల స‌మ‌యంలో ఒకే ఒక్క‌రోజు వ‌చ్చిన కేసీఆర్ త‌ర్వాత‌.. ఫామ్ హౌస్‌కే దాదాపు ప‌రిమితం అయ్యారు.

అయితే.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం స‌భకు రావాల‌ని.. ఏ విష‌యంపైనైనా చ‌ర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని.. త‌రచుగా చెబుతున్నారు. ముఖ్యంగా బీఆర్ ఎస్ హ‌యాంలో జ‌రిగిన అనేక అక్ర‌మాల‌ను వెలుగులోకి తెస్తామ‌ని కూడా ఆయ‌న అంటున్నారు. ఇదిలావుంటే.. జ‌లాల విష‌యంలో కాంగ్రెస్ పార్టీ న‌ల్గొండ‌కు అన్యాయం చేసిందంటూ.. కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు ఇటీవల దుమారం రేపాయి.

పార్టీ నాయ‌కుల‌తో నాలుగు రోజుల కింద‌ట భేటీ అయిన‌.. కేసీఆర్‌.. జ‌లాల విష‌యాన్ని ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. పాల‌మూరుకు త‌ట్టెడు మ‌ట్టి కూడా వేయ‌లేద‌న్నారు. ఇది కూడా దుమారం రేపింది. ఈ నేప‌థ్యంలోనే బ‌య‌ట ఉండి.. కేక‌లు వేయ‌డం కాదు.. స‌భ‌కు వ‌స్తే స‌మాధానం చెబుతాం అంటూ.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

సోమ‌వారం నుంచి..

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల స‌మావేశాలు సోమ‌వారం నుంచి జ‌ర‌గ‌నున్నాయి. దీనికి సంబంధించి గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌.. నోటిఫికేష‌న్ ఇచ్చారు. అయితే.. ఎన్ని రోజులు జ‌రుగుతాయ‌న్న విష‌యం.. బీఏసీ(బిజినెస్ అడ్వ‌యిజ‌రీ కౌన్సిల్‌) స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకుంటారు.

ఈ స‌మావేశానికి.. అధికార‌, ప్ర‌తిప‌క్ష నేత‌ల ఫ్లోర్ లీడ‌ర్లు హాజ‌రు కానున్నారు. దీనికి కూడా కేసీఆర్ హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. పార్టీ వ‌ర్గాల అభిప్రాయం ప్ర‌కారం.. స‌భ ఎన్ని రోజులు జ‌రిగితే.. అన్నిరోజులు కేసీఆర్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. కానీ.. పార్టీ అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. మరోవైపు.. ఈ స‌మావేశాల‌కు కేసీఆర్ వ‌చ్చినా.. రాక‌పోయినా.. స‌భ మాత్రం వేడివేడిగా సాగ‌నుంది.