ప్రధాని మోదీ నోట.. నరసాపురం మాట

ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ లో ఏపీలోని హస్తకళలను గుర్తు చేశారు. నరసాపురం లేస్‌ క్రాఫ్ట్‌ ను ఆయన ప్రస్తావించారు. ఇక్కడి ఈ హస్తకళకు 200 ఏళ్ల చరిత్ర ఉంది. నరసాపురంలో లేస్‌ క్రాఫ్ట్‌ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2000లో నరసాపురం లేస్‌ పార్క్‌ను ఏర్పాటు చేశారు. అంబేద్కర్ హస్త వికాస్ యోజన కింద ఈ హస్తకళను సంరక్షించేందుకు, ప్రోత్సహించేందుకు తీసుకున్న చొరవను డీఆర్‌డీఏ సద్వినియోగం చేసుకుని భారతదేశంలోనే తొలి లేస్‌ పార్క్‌ను నరసాపురంలో అభివృద్ధి చేసింది.

లేస్‌ పార్క్‌ ఏర్పాటుతో ఉత్పత్తుల విక్రయానికి కొంత మేర వ్యవస్థ ఏర్పడడంతో పాటు, కళాకారిణులకు నేరుగా మార్కెట్‌ చేరువైంది. తరతరాలుగా మహిళలే ఈ అరుదైన హస్తకళను కాపాడుతూ వచ్చారని, ఇప్పుడు దీనికి కొత్త హంగులు చేర్చి ఆధునికంగా ముందుకు తీసుకెళ్తున్నారని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

ఇదే నరసాపురం ప్రాంతంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఈరోజు పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా, నరసాపురం మండలంలోని తాను దత్తత తీసుకున్న పేదమైనవారి లంక గ్రామాన్ని నిర్మలా సీతారామన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన “మన్ కీ బాత్” కార్యక్రమంలో ఆమెతో కలిసి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు.

నరసాపురం లేస్‌ క్రాఫ్ట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ గుర్తింపు ఇవ్వడంపై మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ, నరసాపురం లేస్‌ కళలోని శాశ్వత సౌందర్యాన్ని, దాని వెనుక ఉన్న శ్రమకు గౌరవం లభించడంపై ఆనందం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంప్రదాయ లేస్‌ క్రాఫ్ట్‌ ద్వారా లక్షకు పైగా మహిళలు జీవనోపాధి పొందుతున్నారని నారా లోకేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ కళ మహిళల జీవితాలకు ఆధారంగా నిలుస్తోందని, తరతరాలుగా కొనసాగుతున్న ఈ వ్యవస్థ రాష్ట్రానికి గర్వకారణమని తెలిపారు.