ఏపీలో జిల్లాల విభజన వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పటివరకు మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ, తాజాగా రెండు జిల్లాలకే పరిమితం కావాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. ప్రజల అభిప్రాయాలు, వారి మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలని జిల్లాల పునర్విభజనపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి సూచించారు. ప్రజల ఇష్టమే ప్రభుత్వ ఇష్టమని స్పష్టం చేశారు. ప్రజలపై బలవంతంగా రుద్దే ఏ నిర్ణయం సరైంది కాదని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో మూడు జిల్లాల బదులు రెండు కొత్త జిల్లాల ఏర్పాటు మాత్రమే చేయాలని సూచించారు.
శనివారం జిల్లాలు, మండలాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు మంత్రివర్గ ఉపసంఘం మరియు అధికారులతో సమావేశమయ్యారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను సమీక్షించారు. ఇప్పటివరకు మంత్రివర్గం చేసిన కసరత్తును పరిశీలించిన అనంతరం, కేవలం రెండు జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పారు. మొదట మదనపల్లె, పోలవరం, మార్కాపురం ప్రాంతాలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ, వీటిలో రెండు మాత్రమే ఎంపికయ్యాయి. మదనపల్లె మరియు మార్కాపురం జిల్లాలను మాత్రమే కొత్తగా ఏర్పాటు చేయనున్నారు.
డివిజన్ల విషయానికి వస్తే, రాజంపేట డివిజన్‌ను తిరిగి కడపలో కలపనున్నారు. అలాగే రాయచోటిని మదనపల్లెలో విలీనం చేస్తారు. ఈ ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి. అయితే కొన్ని జిల్లా కేంద్రాలకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజల నుంచి వచ్చిన డిమాండ్లను పరిశీలించి కొత్త జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. అయితే చివరకు రెండు జిల్లాలకే పరిమితం అయ్యారు.
సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో మరోసారి చర్చించి తుది నిర్ణయం ప్రకటించనున్నారు. జిల్లాల విభజనకు ఈ నెల 31 వరకు మాత్రమే గడువు ఉంది.
ఇవీ మార్పులు
కొత్త జిల్లాలు
మదనపల్లె
మార్కాపురం
మార్కాపురం జిల్లాలో కలిసే మండలాలు
దొనకొండ
కురిచేడు
ప్రకాశం జిల్లాలో కలిపే మండలం
పొదిలి
నెల్లూరు జిల్లాలో కలిసే మండలం
గూడూరు
తిరుపతిలో కలిసే మండలం
గూడూరు
Gulte Telugu Telugu Political and Movie News Updates