అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాలగుండ్ల శంకరనారయణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. సీఎం జగన్ ఆయనపై అనేక ఆశలతో ఎంతో మంది పోటీలో ఉన్నా.. మంత్రిగా తొలి ఛాన్స్ ఇచ్చారు. అయితే.. గడిచిన ఏడాదిన్నరలో మంత్రి శంకర నారాయణ గ్రాఫ్ చూస్తే.. తీవ్ర వివాదాలు కాకపోయినా.. ఇంటా బయటా కూడా.. ఆయనకు అసమ్మతి పెరుగుతోందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. వ్యక్తిగతంగా ఆయన దూకుడు చూపించలేక పోయినా.. పెనుకొండలో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు.
ముఖ్యంగా సాగు, తాగు నీటి సమస్య అధికంగా ఉన్న పెనుకొండలో తమ సమస్య పరిష్కరించాలంటూ.. ఎప్పటి నుంచో ఇక్కడి ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. ఎవరు ఎన్నికైనా.. వారి ప్రధాన లక్ష్యం ఇదే కావాలని ఎన్నికల సమయంలోనే ప్రజలు కోరుతున్నారు. అయితే.. ఎన్నికలప్పుడు ఓకే అంటున్న నాయకులు తర్వాత మాత్రం మరిచిపోతున్నారు. ఇక, రహదారులు తీవ్ర అధ్వానంగా ఉండడంతో ఇటీవల మంత్రి పర్యటనను మరోసారి ఇక్కడి ప్రజలు అడ్డుకున్నారు. ఇక, బీసీ సంక్షేమ మంత్రిగా ఉన్న తమకు శంకర నారాయణ న్యాయం చేయడం లేదని బీసీలే ఆరోపిస్తుండడం గమనార్హం.
వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. వందల సంఖ్యలో డైరెక్టర్లను కూడా నియమించింది. అయినప్పటికీ.. వీటికి విధులు, నిధులు కేటాయించలేదు. మరోవైపు నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ తమకు న్యాయం జరగడం లేదని బీసీలు ఆరోపిస్తున్నారు. ఈ విషయాల్లో తమకున్యాయం చేయాల్సిన మంత్రి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. తమ ఆవేదనను మంత్రే వినిపించుకోవడం లేదని.. ఇక, తమ సమస్యలు ఎవరు తీరుస్తారని అంటున్నారు. ఇక, ఇన్ని ఆరోపణలు వచ్చినా.. విమర్శలు వచ్చినా.. మంత్రి మాత్రం మౌనంగా ఉంటున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా జగన్ను కొనియాడుతున్నారని అంటున్నారు పరిశీలకులు.