ఒకప్పుడు నేతలకు.. ఇప్పుడు పిల్లలకు..

హైదరాబాద్‌లోని గండిపేట ప్రాంతంపై తనకు ఎంతో మక్కువ ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. గండిపేటలో ఒకప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయం ఉండేదని చెప్పారు. అక్కడ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు శిక్షణ ఇచ్చి వారిని మేలైన నేతలుగా తీర్చిదిద్దామని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు అదే ప్రాంతంలో ఎన్టీఆర్ విద్యాసంస్థలను ఏర్పాటు చేసి చిన్నారులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. అందుకే తనకు గండిపేట అంటే అమితమైన మక్కువ అని అన్నారు.

తాజాగా ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి, సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.

తొలుత విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించిన సీఎం చంద్రబాబు, అనంతరం సతీసమేతంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలను తిలకించారు. విద్యలో రాణిస్తున్న పలువురు విద్యార్థులకు పతకాలు అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి చంద్రబాబు కీలక ఉపన్యాసం చేశారు.

ఒకప్పుడు రాజకీయ కేంద్రంగా ఉన్న గండిపేట కార్యాలయం ఇప్పుడు విద్యలకు నిలయంగా మారిందన్నారు. ఇక్కడ వేలాది మంది శిక్షణ పొందుతున్నారని తెలిపారు. ముఖ్యంగా కుటుంబాల్లో వివిధ కారణాల వల్ల తలెత్తిన వివాదాల కారణంగా అనాథలైన చిన్నారులను చేరదీసి వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నామని చెప్పారు.

ఎన్టీఆర్ విద్యాసంస్థలను భువనేశ్వరి సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు. తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో ఎన్టీఆర్ విద్యాసంస్థలకు చెందిన నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారని, ఇది తనకు ఎంతో తృప్తిని ఇచ్చిందన్నారు. అలాగే ఐఐటీలు, ఎన్ ఐటీల్లో కూడా ఎన్టీఆర్ విద్యాసంస్థల్లో చదువుతున్న చిన్నారులు రాణిస్తున్నారని తెలిపారు. మొత్తంగా 1600 మందికిపైగా పిల్లలు ఎన్టీఆర్ విద్యాసంస్థల్లో చదువుతున్నారని వివరించారు.

ఇక హైదరాబాద్‌లో ఐటీ, ఉన్నత విద్యాసంస్థల రాక వంటి అంశాలపైనా చంద్రబాబు మాట్లాడారు. ఒకప్పుడు ఐటీ చదువుల కోసం వేర్వేరు ప్రాంతాలకు, విదేశాలకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. కానీ తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉన్నత విద్యాసంస్థలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామని, తద్వారా హైదరాబాద్ ఉన్నత విద్యకు కేర్ ఆఫ్‌గా మారిందని వివరించారు.

హైటెక్ సిటీ ద్వారా ఐటీని ప్రోత్సహించానన్నారు. ఇప్పుడు హైటెక్ సిటీ హైదరాబాద్‌కు ఒక మణిహారంగా మారిందన్నారు. అలాగే సాగు రంగానికి దన్నుగా ఉండేందుకు హెరిటేజ్ సంస్థను స్థాపించామని, దీని వల్ల వేల మంది పాడి రైతులు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. ఇదే తరహాలో ఏపీని కూడా అభివృద్ధి చేస్తున్నామని, ఐటీ, కంప్యూటింగ్, హరిత ఇంధనం, గూగుల్ డేటా సెంటర్లను తీసుకువస్తున్నామని తెలిపారు.