ఆర్ఎస్ఎస్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రశంసలు

కాంగ్రెస్ పార్టీలో ఆర్ఎస్ఎస్, బీజేపీలపై నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ హైకమాండ్‌కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్‌పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీయగా, మరోవైపు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై చేసిన ప్రశంసలు పార్టీలో అసంతృప్తిని పెంచాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి.

ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ తీవ్ర చర్చకు దారి తీసింది. గుజరాత్‌లో గతంలో జరిగిన ఒక కార్యక్రమానికి సంబంధించిన ఫొటోను ఆయన షేర్ చేశారు. అందులో ఎల్ కె అద్వాణీతో పాటు నరేంద్ర మోదీని ప్రస్తావించారు. ఒక సాధారణ కార్యకర్త దేశ ప్రధానిగా ఎదగడం వెనుక ఆర్ఎస్ఎస్‌కు ఉన్న సంస్థాగత బలమే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పోస్టులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ట్యాగ్ చేయడంతో రాజకీయ వర్గాల్లో మరింత కలకలం రేగింది.

అయితే ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో దిగ్విజయ్ సింగ్ వెంటనే స్పందించారు. తాను ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని గానీ, ప్రధాని మోదీ పాలనా విధానాలను గానీ సమర్థించడం లేదని స్పష్టం చేశారు. కేవలం ఆ సంస్థకు ఉన్న సంఘటనా సామర్థ్యాన్ని మాత్రమే ప్రస్తావించానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఇలాంటి బలమైన సంస్థాగత వ్యవస్థ, అధికార వికేంద్రీకరణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.