ఫ్యాక్ట్ చెక్: ఇంద్రకీలాద్రికి కరెంట్ కట్?

బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ దేవస్థానానికి సంబంధించి విద్యుత్ బిల్లుల అంశంపై ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. లక్షల మంది భక్తులు సందర్శించుకునే ఈ ఆలయానికి బిల్లులు బకాయిలు ఉన్నాయనే కారణంతో గంటసేపు విద్యుత్తు సరఫరా నిలిపివేయడం.. ఆ వెంటనే పునరుద్ధరించటం జరిగిపోయాయి.

దీనికి సంబంధించి దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అధికారులు వివరణ ఇచ్చారు. రెండేళ్లుగా దుర్గ గుడి యాజమాన్యం అప్పారావుపేటలోని, పాముల కాలువ వద్ద గల తమ సోలార్ ప్లాంట్ ద్వారా ప్రతిరోజూ 24 మెగావాట్ విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మండలికి ఉచితంగా అందిస్తోంది. ఇందుకు ప్రతిగా విద్యుత్ శాఖ వారు దేవస్థానానికి చెందిన 10 సర్వీసులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

అయితే, ప్రస్తుతం ఆ సర్వీసులకు సంబంధించి బిల్లులు చెల్లించాలని విద్యుత్ శాఖ కోరుతోంది. ఈ విషయంపై ప్రస్తుతం చర్చలు జరిగాయి. చర్చల అనంతరం విద్యుత్ ను పునరుద్ధరించారు. 

అంతకుముందు ఏం జరిగిందంటే గడువు ముగిసినా దుర్గగుడి అధికారులు దాదాపు 3.20 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించలేదని విద్యుత్ శాఖ చెబుతోంది. పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని స్పష్టం చేసింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు సమాచారం.

ఒకసారిగా విద్యుత్తు ఆగిపోవడంతో, అధికారులు వెంటనే జనరేటర్ల ద్వారా విద్యుత్ సరఫరా చేశారు. కొద్దిసేపు లిఫ్టులు, ఏసీలు పనిచేయకపోవడంతో భక్తులు కొంత అసౌకర్యానికి పోయారు. అధికారులు విద్యుత్ శాఖ ఉన్నతాధికారితో చర్చలు జరిపి విద్యుత్ పునరుద్ధరణ జరిగేలా చేశారు.