‘నేను తెలంగాణ ప్రజల బాణాన్ని..’

తెలంగాణలో రాజకీయ శపథకాలు పెరుగుతున్నాయి. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ను మరోసారి అధికారంలోకి రానివ్వబోనంటూ సీఎం రేవంత్ రెడ్డి శపథం చేశారు. ఇక, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమికొడతామంటూ కేసీఆర్ శపథం చేశారు. తాజాగా కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా భీషణ ప్రతిజ్ఞ చేశారు.

బీఆర్ ఎస్ పార్టీతో తాను తెగతెంపులు చేసుకున్నానని, మరోసారి ఆ పార్టీ కండువా కప్పుకునే పరిస్థితే లేదని ఆమె కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, ఒకవేళ పిలిచి పగ్గాలిస్తామని చెప్పినా తాను ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ ఎస్ పార్టీలో చేరేది లేదన్నారు. ఒకసారి బయటకు వచ్చాక తిరిగి ఆ పార్టీలో చేరేది లేదని తెగేసి చెప్పారు.

తనను తీవ్రంగా అవమానించారని వ్యాఖ్యానించిన కవిత, తెలంగాణ ప్రజల సమస్యల కోసం బయటకు వచ్చానని, వారి కోసమే ప్రజల మధ్య తిరుగుతున్నానని చెప్పారు. అకారణంగానే తనను పార్టీ నుంచి బయటకు పంపించారని, ఆ సమయంలో తాను చాలా బాధపడ్డానని తెలిపారు.

కానీ తెలంగాణ ప్రజల కోసం, సమాజం కోసం తిరిగి ప్రజల మధ్యకు వచ్చినట్టు వివరించారు. ఆ మాత్రం ఆత్మగౌరవం లేని వ్యక్తిని కాదని కవిత స్పష్టం చేశారు. ఆత్మగౌరవం కోసమే రాష్ట్రం పుట్టిందని, ఈ రాష్ట్ర బిడ్డగా తుదిశ్వాస వరకు ఆత్మగౌరవంతోనే బతుకుతానని అన్నారు.

తెలంగాణ జాగృతికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, తెలంగాణ ప్రజలతో తనకు పేగు బంధం ఉందని వ్యాఖ్యానించారు. 19 ఏళ్ల కిందటే తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.

తాను తెలంగాణ ప్రజల బాణాన్ని అంటూ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.
“ఎవరో ఏదో అనుకుంటే నేను సమాధానం చెప్పను. నేను ఎవరో వదిలిన బాణాన్ని కాదు. నేను తెలంగాణ ప్రజల కోసం వచ్చిన బాణాన్ని. వారి కోసమే ఉంటాను. వారి కోసమే పనిచేస్తా” అని కవిత అన్నారు.

తెలంగాణ జాగృతి సంస్థ తన సొంతమని, ఎవ్వరూ పెట్టలేదని పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాదు, బీఆర్ ఎస్‌లో ఉన్నప్పుడు అనేక తప్పులు జరిగాయని, ఆ తప్పుల్లో తాను కూడా భాగమైనందున ప్రజలు తనను క్షమించాలని ఆమె వేడుకున్నారు.

ఇక, తనకు పార్టీలో ఏనాడూ ప్రాధాన్యం లేదని, కేవలం తనను నిజామాబాద్‌కే పరిమితం చేశారని కవిత వెల్లడించారు.