ఒక్కొక్క‌రి ఖాతాలో 60 వేలు: బాబు క్రిస్మ‌స్ బొనాంజా!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి త‌న ఉదార‌త‌ను చాటుకున్నారు. అన్ని వ‌ర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేస్తాన‌ని చెబుతున్న ఆయ‌న‌. ఇప్పటికే ప‌లు పండుగ‌ల‌ను రాష్ట్ర అధికారిక పండుగ‌లుగా గుర్తించారు. వాటిని ప్ర‌భుత్వం త‌ర‌ఫున కూడా నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో తొలిసారి ఏసు క్రీస్తు జ‌న్మ‌దినం, క్రిస్మ‌స్‌ను రాష్ట్ర అధికారిక పండుగగా గుర్తించారు. ప్ర‌భుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సెమీ క్రిస్మ‌స్ వేడుక‌ల‌ను కూడా నిర్వ‌హిస్తోంది. గ‌వ‌ర్న‌ర్ స‌హా మంత్రులు కూడా ఆయా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు.

ఇక‌, క్రీస్మ‌స్ వేడుక‌ల కోసం చ‌ర్చిల‌ను నిర్వ‌హించే పాస్ట‌ర్ల‌కు నెల నెలా రూ.5 వేల చొప్పున ఇస్తామ‌న్న హామీని సీఎం చంద్ర‌బాబు నిల‌బెట్టు క‌న్నారు. ఈ ఏడాదికి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు లెక్క చూసి (12 మాసాలు) మొత్తంగా 60,000 రూపాయ‌ల‌ను పాస్ట‌ర్ల ఖాతా ల్లో బుధ‌వారం జ‌మ చేశారు. మొత్తం 50 కోట్ల రూపాయ‌ల‌ను రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పాస్ట‌ర్ల ఖాతాల‌కు సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా జ‌మ చేయ‌డం విశేషం.

వైసీపీ హ‌యాంలో పాస్ట‌ర్ల‌కు నెలకు రూ.5000 చొప్పున పింఛను రూపంలో ఇచ్చే ప‌థ‌కాన్ని జ‌గ‌న్ ప్రారంభించారు. అయితే, గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు-బీజేపీతో పొత్తు పెట్టుకోవ‌డంతో ఆయ‌న అధికారంలోకి వ‌స్తే పాస్ట‌ర్ల‌కు రూపాయి కూడా ఇవ్వ‌ర‌ని వైసీపీ నేత‌లు ప్రచారం చేశారు. ప్రత్యేకంగా స‌భ‌లు, సమావేశాలు పెట్టి పాస్ట‌ర్ల‌కు నూరిపోశారు. అయితే, చంద్ర‌బాబు ఎంత మంది పాస్ట‌ర్లు ఉంటే, అంత మందికీ తాను వ‌చ్చాక రూ.5000 ఇస్తాన‌ని అప్ప‌ట్లో హామీ ఇచ్చారు. ఈ మాట ప్ర‌కారం, గ‌త ఏడాది కూడా పాస్ట‌ర్ల‌కు నిధులు ఇచ్చారు.

ఈ ఏడాది, నెల నెలా కాకుండా, త‌మ‌కు ఒకేసారి క్రిస్మ‌స్‌కు నిధులు ఇవ్వాల‌ని పాస్ట‌ర్లు ప్రభుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. దీంతో నెల నెలా ఇచ్చే రూ.5000‌ల‌ను ఒకేసారి, క్రిస్మ‌స్ పుర‌స్కారంగా, వారి ఖాతాల్లో 12 నెల‌ల‌కు సంబంధించిన 60,000 రూపాయ‌ల‌ను బుధ‌వారం జ‌మ చేయడం విశేషం. మొత్తం 8,418 మంది పాస్ట‌ర్ల‌కు ఈ నిధులు అందించారు. వైసీపీ హ‌యాంలో 6,121 మందికే నెల నెలా రూ.5,000 చెల్లింపు జరిగింది. తాజాగా 2,000 మందికి పైగా అద‌నంగా పాస్ట‌ర్లు లబ్ధి పొందారు.