ఢిల్లీలో మూడు రోజులు… కేంద్ర మంత్రికి ఎలర్జీలు

ఢిల్లీ కాలుష్యం గురించి రోజూ ఏదో ఒక వార్త వింటూనే ఉంటాం. సామాన్యులే కాదు, ఇప్పుడు కేంద్ర మంత్రులు కూడా దీని బారిన పడుతున్నారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీ పొల్యూషన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఢిల్లీలో కేవలం మూడు రోజులు ఉన్నా సరే, ఈ కాలుష్యం వల్ల తనకు అలర్జీలు వస్తున్నాయని ఆయన వాపోయారు. ఒక బుక్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాలను బయటపెట్టారు.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కాలుష్యానికి ప్రధాన కారణం తన శాఖే అని ఆయన ఒప్పుకోవడం. ఢిల్లీలో 40 శాతం కాలుష్యం కేవలం వాహనాల వల్లే జరుగుతోందని, రవాణా శాఖ మంత్రిగా ఈ విషయం చెప్పడానికి తాను వెనకాడటం లేదని అన్నారు. ఫాసిల్ ఫ్యూయల్స్ పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించకపోతే దేశానికి నష్టమని అని సూటిగా తెలియజేశారు.

మనం ఏటా పెట్రోల్, డీజిల్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నాం. అందుకే ఎలక్ట్రిక్ వెహికల్స్, హైడ్రోజన్ వాహనాల వైపు మళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని గడ్కరీ నొక్కి చెప్పారు. ఆయన స్వయంగా ఇథనాల్ తో నడిచే ఎకో-ఫ్రెండ్లీ కారును వాడుతున్నట్లు గుర్తుచేశారు.

ప్రస్తుతం ఢిల్లీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గాలి నాణ్యత సూచీ AQI 412 దాటడంతో ‘సివియర్’ కేటగిరీలోకి వెళ్లిపోయింది. నోయిడాలో అయితే ఏకంగా 426 పాయింట్లు నమోదైంది. గడ్కరీ ఇలా మాట్లాడటం కొత్తేమీ కాదు, గతంలో కూడా ఢిల్లీ రావాలంటేనే భయమేస్తోందని, ఇక్కడి కాలుష్యం అంత భయంకరంగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.