2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వై నాట్ 175 అంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన ప్రచారం వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. 175కు175 స్థానాలు ఎందుకు గెలవలేమంటూ జగన్ అతి విశ్వాసంతో ఇచ్చిన స్టేట్మెంట్ డిజాస్టర్ అయింది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం పాలవడంతో పాటు కనీసం ప్రతిపక్ష హోదా దక్కించునేందుకు అవసరమైనన్ని సీట్లు కూడా గెలుచుకోలేకపోయింది.
ఆ తర్వాత వై నాట్ 175 అంటూ జగన్ చేసిన కామెంట్లను మంత్రి లోకేశ్ పలుమార్లు ట్రోల్ చేశారు. అయితే, ఆ విషయాన్ని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మరిచిపోయినట్లున్నారు. అందుకే, ఈ సారి వై నాట్ 200 అంటూ సజ్జల చేసిన కామెంట్లు మరోసారి ట్రోల్ మెటీరియల్ గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ సారి ఎన్నికల్లో డీలిమిటేషన్ జరిగితే 200 కంటే ఎక్కువ సీట్లు గెలిచి అధికారం చేపడతామని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ డీలిమిటేషన్ జరగకపోతే 175 స్థానాలలో 151 కన్నా ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామని కాన్ఫిడెంట్ గా చెప్పారు.
అంతేకాదు, ఈ సారి జగన్ గెలిస్తే 30 ఏళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళతారని, వైసీపీని ప్రజలే గెలిపించి ఆ పాలన తెచ్చుకుంటారని అన్నారు. ఇక, సమకాలీన రాజకీయాల్లో కాలర్ ఎగరేసి పొగడాల్సిన నాయకుడు జగన్ అని ఆకాశానికెత్తేశారు. 5 దశాబ్దాలలో జరగాల్సిన అభివృద్ధిని 5 సంవత్సరాలలో చేసి చూపించిన నాయకుడు జగన్ అని పొగడ్తలలో ముంచెత్తారు.
ప్రజలు తమ తలరాతలను తామే రాసుకునేలాగా జగన్ చేశారని కొనియాడారు. జగన్ అప్పులు తెచ్చి పంచలేదంటూ సజ్జల స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తూ పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే సజ్జలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.
2024 ఎన్నికలకు ముందు 175 అంటూ బొక్క బోర్లా పడినా సజ్జలకు ఇంకా జ్ఞానోదయం కాలేదని విమర్శిస్తున్నారు. ఈ సారి అంతకు మించిన అతి విశ్వాసంతో ఈసారి వై నాట్ 200 అంటూ సజ్జల ఓవర్ కాన్ఫిడెన్స్ తో కామెంట్స్ చేస్తున్నారని అంటున్నారు. జగన్ వై నాట్ 175 అంటే 11 సీట్లు వచ్చాయని, ఈ సారి సజ్జల వై నాట్ 200 అంటే 5 సీట్లు కూడా రావేమోనని చురకలంటిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates