ప్రపంచ ప్రఖ్యాత కాఫీ సంస్థ స్టార్‌బక్స్ తమ కొత్త చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ CTO గా భారత సంతతికి చెందిన ఆనంద్ వరదరాజన్‌ను నియమించింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు అమెజాన్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆయన, ఇప్పుడు స్టార్‌బక్స్ సాంకేతిక విభాగానికి బాస్ కాబోతున్నారు. గత సెప్టెంబర్‌లో రిటైర్ అయిన డెబ్ హాల్ లెఫెవ్రే స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఆనంద్ వరదరాజన్ వచ్చే ఏడాది జనవరి 19న అధికారికంగా బాధ్యతలు చేపడతారు. ఆయన నేరుగా స్టార్‌బక్స్ సీఈఓ బ్రియాన్ నికోల్‌కు రిపోర్ట్ చేస్తారు. కంపెనీ ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ టీమ్‌లో చేరి, సంస్థ తీసుకునే కీలక నిర్ణయాల్లో భాగస్వామ్యం కానున్నారు. అప్పటి వరకు తాత్కాలికంగా బాధ్యతలు చూస్తున్న నింగ్యు చెన్ నుంచి ఆయన పగ్గాలు అందుకోనున్నారు. సురక్షితమైన, నమ్మదగిన సిస్టమ్స్‌ను డెవలప్ చేయడంలో ఆనంద్‌కు అపారమైన అనుభవం ఉంది.
ముఖ్యంగా కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని టెక్నాలజీని ఎలా వాడాలో ఆయనకు బాగా తెలుసు అని స్టార్‌బక్స్ పేర్కొంది. స్టోర్లలో సిబ్బంది పనిని సులభతరం చేయడానికి, కస్టమర్లకు మంచి అనుభవాన్ని ఇవ్వడానికి డిజిటల్ టూల్స్ మీద ఆయన ఫోకస్ పెట్టనున్నారు. ఆనంద్ వరదరాజన్ విద్యాభ్యాసం విషయానికి వస్తే, ఆయన మద్రాస్ ఐఐటీ పూర్వ విద్యార్థి. అక్కడ సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు.
ఆ తర్వాత విదేశాల్లో పర్డ్యూ యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మరో మాస్టర్స్ డిగ్రీ పొందారు. జెఫ్ బెజోస్‌కు చెందిన అమెజాన్‌లో ఆయన ఏకంగా 19 ఏళ్లు పనిచేశారు. అక్కడ వరల్డ్ వైడ్ గ్రోసరీ స్టోర్స్ బిజినెస్‌కి సంబంధించిన టెక్నాలజీని చూసుకున్నారు. అంతకుముందు ఒరాకిల్, కొన్ని స్టార్టప్ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కూడా పనిచేశారు. ఇప్పుడు ఆయన రాకతో స్టార్‌బక్స్ డిజిటల్ సామర్థ్యం మరింత పెరుగుతుందని సంస్థ భావిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates