అద్దె ఇంటికి, సొంత ఇంటికి చాలా తేడా ఉంటుంది. మనకు నచ్చకపోతే లేదంటే యజమానికి మనం నచ్చకపోతేనో అద్దె ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంటుంది. సొంతిల్లు అలా కాదు.. అదే విషయాన్ని మంత్రి నారా లోకేష్ పార్టీకి అన్వయించి కార్యకర్తలకు, నేతలకు అర్థమయ్యేలా చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడే సచివాలయంలో ఉంటాము.. అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ శాశ్వతం అని నొక్కి చెప్పారు.
పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలతో ఆయన కేంద్ర కార్యాలయంలో సమావేశం అయ్యారు. రెండున్నర గంటల పాటు సుదీర్ఘంగా వారితో చర్చించారు. పార్టీ నే సుప్రీం, పార్టీ ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాల్సిందే.. ఎంత పెద్ద నాయకులకైనా ఇదే వర్తిస్తుందని ఆయన చెప్పారు. గడిచిన ఏడాదిన్నర కాలంలో ఎమ్మెల్యేగా పనితీరుపై ఒక నివేదిక ఇవ్వాలని సమన్వయకర్తలకు ఆయన సూచించారు.
చంద్రబాబు, లోకేష్ పరిపాలనకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారో పార్టీకి అంతే సమయాన్ని ఇస్తున్నారు. ఎమ్మెల్యేలకు మంచిగా చెబుతున్నారు. పనితీరు బాగోలేకపోతే మార్చుకోమని హెచ్చరిస్తున్నారు. అయితే కొంతమంది పదేపదే చెప్పించుకుంటున్నారు అనే అపోహ ప్రజల్లో ఉంది. అది ఆ ఎమ్మెల్యేలకు కూడా మంచిది కాదు. ఇంకా పనితీరు బాగా లేని ఎమ్మెల్యేలను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇస్తామని లోకేష్ గట్టిగానే చెప్పారు. అయితే గడిచిన రెండు నెలల్లో ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడిందని లోకేష్ చెబుతున్నారు. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత సమన్వయకర్తలదే అని ఆయన అన్నారు.
పార్టీ పదవుల పైన కూడా ఆయన స్పష్టత ఇచ్చారు. కార్యకర్తలకే ప్రాధాన్యమని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వాలని ప్రతిపాదిస్తే కచ్చితంగా తిరస్కరించాలన్నారు. పదవుల విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం బిగించి పోరాడిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలని లోకేష్ అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates