తిరుపతి ఉప ఎన్నికకు త్వరలోనూ ముహూర్తం ఖరారు కానుంది. దీనికి సంబందించి పార్టీలు ఎవరికి వారు పోటీ పడేందుకు రెడీ అయ్యారు. ఈ విషయంలో చంద్రబాబు మరింత స్పీడ్‌గా స్పందించారు. ఇక, బీజేపీ, జనసేనల కూటమి కూడా బాగానే ఇక్కడ ప్రచారం చేయాలని.. ఎట్టి పరిస్థితిలోనూ దూకుడు చూపించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారనుంది. మరీ ముఖ్యంగా గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత జరుగుతున్న ఏకైక ఉప ఎన్నిక ఇదే కావడంతో జగన్‌పై తమకు ఉన్న వ్యతిరేకతను ప్రజలు వ్యక్తీకరించేందుకు ఇదే అవకాశమని, కాబట్టి తాము పుంజుకునేందుకు అవకాశం ఉంటుందని పార్టీలు భావిస్తున్నాయి.
ఒకవైపు అమరావతి రాజధాని తీసేయడం, మరోవైపు నిత్యావసర ధరలు, ఇంకోవైపు వివిధ కారణాలు చూపుతూ.. తెల్ల రేషన్ కార్డులను ఎత్తేయడం, ఎస్సీ, ఎస్టీలపై దాడులు, మరీ ముఖ్యంగా తిరుమలలో జరుగుతున్న అపచారాలు.. దేవాలయాలకు రక్షణ కొరవడడం వంటి అనేక ప్రధాన అంశాలను అస్త్రాలుగా చేసుకుని ప్రతిపక్షాలు దూకుడుగా ప్రచారం చేయాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చాయి. మరి ఇంత కీలక సమరంలో సీఎం జగన్ ఎలా వ్యవహరించాలి? ఎంత గట్టి నాయకుడికి ఇక్కడ అవకా శం ఇవ్వాలి? అనే అంశాలు చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ తీసుకునే నిర్ణయం ఆసక్తిగా మారింది. అయితే.. ఆయ న ఇక్కడ ఇప్పటికే ఒక అభ్యర్థిని ఖరారు చేసిన ట్టు ప్రచారం జరుగుతోంది.
తన పాదయాత్ర సమయంలో ఫిజియోథెరపీ వైద్యుడిగా పరిచయమైన డాక్టర్ గురుమూర్తికి ఇక్కడ టికెట్ ఇస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే.. ఈయన రాజకీయాలకు కొత్త. పైగా తిరుపతి నియోజకవర్గానికి అసలే కొత్త. దీంతో ఏమేరకు విజయం సాధిస్తారు? ఎలా ప్రజలకు పరిచయం అవుతారు? అనేది ప్రధాన ప్రశ్న. ఇదేం సార్వత్రిక సమరం కాదు. అయినా కూడా జగన్ ప్రయోగానికి సిద్ధపడడం వెనుక రీజన్ ఏంటనేది చూడాలి. ఇక, జగన్ స్వయంగా ఇక్కడ ప్రచారం చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఉప ఎన్నిక కావడంతో సీఎం స్థానంలో ఉన్న ఆయన దిగివచ్చి ప్రచారం చేస్తే.. ప్రతిపక్షాలు చులకనగా భావించే అవకాశం ఉంది. అయినప్పటికీ.. తాను ప్రవేశ పెట్టిన పథకాలు, చేస్తున్న సంక్షేమం వంటివి తనకు ఫలితాన్ని ఇస్తాయని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ ప్రయోగం వికటిస్తుందా? లేక.. సక్సెస్ అవుతుందా చూడాలి.
కొసమెరుపు ఏంటంటే.. తిరుపతి ప్రయోగం సక్సెస్ అయితే.. వైసీపీలో దూకుడుగా ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలు కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. తమ వ్యవహారాలు ముదిరి.. జగన్‌కు కనుక ఆగ్రహం వస్తే.. తమ ప్లేస్‌లో కొత్తవారిని పెట్టి గెలిపించుకునే అవకాశం ఉంటుందనే సంకేతాలు రావడం ఖాయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates