‘అవున‌యా… అదేమ‌న్నా జ‌గ‌న్ సొంత‌మా?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌లు సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు సంబంధించి ఒక ప్ర‌త్యేక `క్యాలెండ‌ర్‌` తీసుకురావాల‌ని నిర్ణ‌యించారు. వ‌చ్చే ఏడాది మొద‌ల‌య్యే ఆర్థిక సంవ‌త్స‌రం(ఏప్రిల్ 1) నుంచి ఈ క్యాలెండ‌ర్‌ను అమల్లోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించి తాజాగా క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌క‌టించిన సూప‌ర్ సిక్స్ స‌హా అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నారు.

ఆయా విష‌యాలు. ప‌థ‌కాలు, అర్హ‌త‌లు, ఎప్పుడెప్పుడు ఏ ప‌థ‌కం కింద నిధులు ఇస్తారు? అనే విష‌యాలను స్ప‌ష్టంగా పేర్కొంటూ.. సంక్షేమ క్యాలెండ‌ర్‌ను రూపొందించాల‌ని.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స‌చివాల‌యాల్లోనూ ఏర్పాటు చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. త‌ద్వారా ప్ర‌భుత్వం ఎంత ఖ‌ర్చు పెడుతోంది?  ఏయే సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌ల‌వుతున్నాయ‌న్న‌ది.. కూడా ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటుంద‌న్నా రు. అదేవిధంగా చెప్పిన‌వే కాకుండా.. చెప్ప‌నివి కూడా అమ‌లు చేస్తున్న విష‌యం తెలుస్తుంద‌న్నారు.

సంక్షేమ క్యాలెండ‌ర్‌ను ఏర్పాటు చేయ‌డంతోపాటు.. ఆయా ప‌థ‌కాల‌కు సంబంధించి ఆర్థిక వ‌న‌రుల‌ను కూడా సంసిద్ధం చేసుకోవాల‌ని సీఎం తెలిపారు. ముఖ్యంగా కూట‌మి స‌ర్కారు ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌ల్లో ప్ర‌స్తుతం 80 శాతం సంతృప్తి ఉంద‌ని.. దీనికి 90 శాతానికి పెంచాల‌ని సూచించారు. అంతేకాదు.. ఈ విష‌యంలో క‌లెక్ట‌ర్లు జోక్యం చేసుకోవాల‌ని సూచించారు. సంతృప్త స్థాయి పెరిగితేనే ప్ర‌భుత్వానికి కొల‌మాన‌మ‌ని పేర్కొన్నారు.

ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌..

ఈ సంద‌ర్భంగా ఒక‌రిద్ద‌రు క‌లెక్ట‌ర్లు మాట్లాడుతూ.. గ‌తంలోనూ (వైసీపీ) సంక్షేమ క్యాలెండ‌ర్ అమ‌లు చేశా మన్నారు. ఈ విష‌యంపై సీఎం చంద్ర‌బాబు సీరియ‌స్ అయి.. “అయితే.. ఇప్పుడు అమ‌లు చేయ‌కూడ‌ద‌ని ఏమైనా ఉందా?  అదేమ‌న్నా.. జ‌గ‌న్ సొంత‌మా?. మ‌న‌మేమ‌న్నా కాపీ కొడుతున్నామా? ఏది ఎప్పుడు ఇస్తున్నామో చెప్పేది ఎవ‌రైనా చేయొచ్చు. స్కూల్లో పాఠాలు ఎప్పుడు చెబుతారో టైంటేబుల్ ఇవ్వ‌రా.. ఇది కూడా అంతే!“ అని వ్యాఖ్యానించారు.