2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తామే విజయం దక్కించుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం ముగిసిన మూడు దశల పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు అద్భుతమైన తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరిచారని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మొత్తం 12,702 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని కూడా బలహీనపరిచేందుకు బీఆర్ ఎస్, బీజేపీలు ఉమ్మడిగా కలిసి పోటీ చేశాయని సీఎం ఆరోపించారు. అయినా.. ప్రజల మద్దతు మాత్రం తమకే ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఈ మూడు దశల్లోనూ 7527 పంచాయతీలను సొంతం చేసుకుందని, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులుగా బరిలో దిగిన వారు కూడా.. 808 చోట్ల విజయం దక్కించుకున్నారని చెప్పారు. దీనికి కారణం.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న విశ్వసనీయతేనని చెప్పారు.
ఇదేసమయంలో బీజేపీ+బీఆర్ ఎస్ కూటమిగా బరిలో నిలిచినా.. ప్రజలు తిప్పికొట్టినట్టు చెప్పారు. 3511 స్థానాల్లో బీఆర్ ఎస్ మద్దతు దారులు, 710 చోట్ల బీజేపీ అనుకూలురు విజయం సాధించారన్నారు. వాస్తవానికి రాష్ట్రంలో రెండేళ్ల కాంగ్రెస్ పాలన తర్వాత.. తమపై వ్యతిరేకత పెరుగుతుందని బీఆర్ఎస్ , బీజేపీ లు అనుకున్నాయని, కానీ.. ప్రజలు మాత్రం తమవెంటే ఉన్నామని ఈ ఎన్నికల ద్వారా నిరూపించారని సీఎం తెలిపారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే తరహా ఫలితం వస్తుందన్నారు.
మీరు కోరుకున్నట్టే జరుగుతుంది!
బీఆర్ ఎస్ నాయకులను ఉద్దేశించి సీఎం రేవంత్ సెటైర్లు గుప్పించారు. “ప్రస్తుత ఫలితం చూసి అద్భుతమని బీఆర్ ఎస్ నాయకులు చెబుతున్నారు. మంచిది. వారిని అలానే అనుకోమని చెబుతున్నా. వచ్చే ఎన్నికల్లోనూ ఇలాంటి అద్భుతమే జరుగుతుంది. 2/3 మెజార్టీతో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుంది.“ అని రేవంత్ జోస్యం చెప్పారు.
కేసీఆర్ వస్తానంటే..
అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రావడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన వస్తానంటే.. ఇప్పుడే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. ఆయన రావాలనే తాము కోరుకుంటున్నామన్నారు. కానీ, ప్రజలకు చేసిన ద్రోహంపై ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందోనన్న కారణంగా ఆయన తప్పించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates