రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకుని జగన్ గత ఎన్నికల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారంలోకి వస్తామని పదేపదే చెప్పినప్పటికీ, ‘వైనాట్ 175’ మంత్రం పఠించినప్పటికీ కూడా ఆయన పుంజుకోలేకపోయారు. దీనికి ప్రధాన కారణంగా రెడ్డి సామాజిక వర్గాన్ని ఆయన దూరం చేసుకోవడమేనన్న వాదన వినిపిస్తోంది. వాస్తవానికి ఏ రాజకీయ పార్టీకైనా కీలక సామాజిక వర్గాల మద్దతు చాలా అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా వర్గాల మద్దతు లేకుండా పార్టీలు విజయం సాధించడం కష్టంగా మారిందనే అభిప్రాయం బలంగా ఉంది.
ఈ నేపథ్యంలో వైసీపీకి రెడ్డి సామాజిక వర్గం మద్దతు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత ఎన్నికల్లో సంప్రదాయంగా రెడ్లకు కేటాయించే నియోజకవర్గాల్లో కూడా బీసీ సామాజిక వర్గాలకు టికెట్లు ఇవ్వడం, సరైన రాజకీయ సమీకరణలు లేకుండా ఐప్యాక్ సూచనల మేరకు మార్పులు చేయడం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా రెడ్లకు కేటాయించాల్సిన స్థానాలు కూడా బీసీలకు వెళ్లాయి. దీంతో రెడ్డి సామాజిక వర్గం పార్టీకి పూర్తిగా దూరమైందని విశ్లేషకులు చెబుతున్నారు.
ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు పార్టీకి మద్దతు ఉపసంహరించుకోవడం వైసీపీకి మరింత దెబ్బగా మారింది. ఈ పరిణామాలన్నింటి ఫలితంగా పార్టీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. సంక్షేమ పథకాలు అమలు చేశామని, తమకు తిరుగు లేదని చెప్పుకున్న పార్టీ కేవలం 11 స్థానాలకు పరిమితమవడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది.
ఇక వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ప్రస్తుతం వైసీపీకి స్పష్టమైన దిశ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలనే ఆధారంగా చేసుకుని ప్రజల మద్దతు పొందాలని పార్టీ భావించినప్పటికీ, ఇప్పుడు అదే తరహా పథకాలను కూటమి ప్రభుత్వం కూడా అమలు చేస్తోందనే భావన ప్రజల్లో ఏర్పడుతోంది.
ఈ మార్పు ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో జగన్ ఇచ్చినట్టుగానే ఇప్పుడు కూడా సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ప్రజలు భావిస్తుండటంతో, వైసీపీ కొత్తగా రాజకీయంగా బలమైన మార్పులు తీసుకురాకపోతే మరింత నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న అసంతృప్తిని తగ్గించి, ఆ వర్గాన్ని మళ్లీ దగ్గర చేసుకోలేకపోతే వైసీపీ భవిష్యత్తు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని వారు విశ్లేషిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates