ఏపీ బీజేపీలో నాయకుల మధ్య లుకలుకలు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పడకపోవడం.. ఒకరిపై మరొకరు ఆధిపత్య రాజకీయాలు చేయడం వంటివి కామన్‌గా మారాయి. అయితే.. సాధారణంగా ఏ పార్టీలో అయినా.. ఇలాంటి ఆధిపత్య రాజకీయాలు ఉంటాయి. అదేసమయంలో క్షేత్రస్థాయి నాయకులు కూడా తమ తమ శైలిలో రాజకీయాలు చేస్తుంటారు. దీనిని పార్టీలు కూడా సహిస్తుంటాయి. కానీ.. ప్రత్యర్థి పార్టీలకు కోవర్టులుగా వ్యవహరించే వారి విషయమే ఎప్పుడూ ఇబ్బందులకు దారి తీస్తుంది.
ఇప్పుడు ఏపీ బీజేపీలో ఈ విషయమే చర్చకు వస్తోంది. పార్టీలో కోవర్టులు ఉన్నారంటూ.. కొన్నాళ్లుగా నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అది కూడా వైసీపీకి మేలు చేసేలా వ్యవహరించే వారు ఉన్నారన్నది వారి మాట.
ఒక వైపు కూటమి పార్టీలు కలసి కట్టుగా ముందుకు సాగాలని భావిస్తుంటే.. నాయకులు ఎవరైనా కూడా.. దీనికి దన్నుగా నిలవాల్సి ఉంటుంది. కానీ, పార్టీ పరంగా మాత్రం కొందరు నాయకులు వైసీపీకి, జగన్‌కు కూడా కోవర్టులుగా వ్యవహరిస్తున్నారంటూ.. బీజేపీ అధిష్టానానికి లేఖలు ముటాయని సమాచారం. ఇది ఇప్పుడు అంతర్గత చర్చల్లో హాట్ టాపిక్‌గా మారిందన్నది వాస్తవం.
“నిజమే. ఈ విషయం కొన్నాళ్లుగా చర్చనీయాంశంగా మారింది. కొందరు నాయకుల వ్యవహార శైలి అలానే ఉంది.“ అని విజయవాడకు చెందిన కీలక బీజేపీ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. అయితే.. దీనిని తప్పుపట్టాల్సిన అవసరం లేదని చెప్పడం విశేషం. కేంద్రంతో ఉన్న సత్సంబంధాల విషయంలో బీజేపీ నాయకులు కొందరు గతంలో వైసీపీ అధినేతతో పనులు చేయించుకున్నారని.. రాజ్యసభ సీటు కూడా దక్కించుకున్నారని.. సో.. అలాంటప్పుడు ఇవన్నీ కామనేనని చెప్పిన నాయకుడు కూడా ఉన్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. కోవర్టులు వెనక్కి తగ్గాల్సిందేనని హెచ్చరించడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates