బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో ఉండాలో.. ఏ పార్టీ తరఫున పనిచేయాలో ప్రజలే తేల్చుకుంటారని అన్నారు. ప్రస్తుతం తనపై జరుగుతున్న ప్రచారం విషయాన్ని బీజేపీ హైకమాండ్ చూసుకుంటుందన్నారు. తనపై వస్తున్న ఆరోపణలను కూడా ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. ఇక, గత కొంత కాలంగా బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్‌కు.. ఎంపీ ఈటల రాజేందర్‌కు మధ్య పొసగడం లేదు.
ఈటల రాజేందర్ గతంలో 2023లో హుజూరాబాద్‌లో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం.. గత ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ తరఫున మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. అయితే.. హుజూరాబాద్ లో ఈటల వర్గానికి.. బండి సంజయ్ వర్గం చెక్ పెడుతోంది. ఇక్కడ పెద్ద ఎత్తున బండి వర్గం విస్తరిస్తోంది. హుజూరాబాద్ మొత్తం బండి ఆధ్వర్యంలోనే ఉందని ఆయన అనుచరులు తరచుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ పరిణామాలే.. ఇరువరు నాయకుల మధ్య అగాథాన్ని పెంచుతున్నాయి. తరచుగా ఈటల ఫైర్ కావడానికి కూడా ఇదే కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇదిలావుంటే.. తాజాగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లోనూ.. హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల్లో బండి సంజయ్ మద్దతు దారులు.. తమ అనుచరులను బరిలోకి దింపారు. దీంతో వివాదం మరింత పెరిగింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. బండి సంజయ్ అనుచరుడు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై స్పందించిన ఈటల తనపై ఆరోపణలు చేస్తున్న వారి వ్యవహారాన్ని పార్టీ అధిష్టానంచూస్తుందని వ్యాఖ్యానించారు. ఇదేసమయంలో తాను ఏ పార్టీలో ఉండాలో కూడా.. ప్రజలే నిర్ణయిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఆయన బీజేపీలోనే ఉన్నా.. కొన్నాళ్లుగా ఆయనకు ప్రాధాన్యం లేకుండా పోయిందన్నది వాస్తవం. ఈ నేపథ్యంలోనే ఈటల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నారు.
కొన్నాళ్ల కిందట రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి పదవి కోసం ఈటల ప్రయత్నించారు. ఆ సమయంలోనూ బండి సంజయ్ అడ్డు పడ్డార న్న వాదన ఉంది. అదేవిధంగా తన సొంత నియోజకవర్గం(ఓడిపోయినా) హుజూరాబాద్‌లోనూ ఈటలకు ఇబ్బందులు సృష్టిస్తున్నారన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలోనే ఈటల తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు… పార్టీ తరఫున వాయిస్ వినిపించే క్రమంలోనూ ఈటల వెనుకబడ్డారన్న వాదన బీజేపీ నేతల మధ్య వినిపిస్తోంది. కానీ, తనను తన వాయిస్‌నుకొందరు కావాలనే తొక్కిపెడుతున్నారని ఈటల చెబుతున్నారు. మొత్తంగా బండి వర్సెస్ ఈటల మధ్య జరుగుతున్న రాజకీయ పోరు ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates