11 సీట్లు ఎలా వచ్చాయన్నదానిపై కోటి సంతకాలు చేయించాలి

ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్‌లైన్‌ను మళ్లీ మళ్లీ పొడిగించారు. కోటి సంతకాలు సేకరించి గవర్నర్ నజీర్‌ను కలిసి పీపీపీకి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవాలన్నది వైసీపీ అధినేత జగన్ ఉద్దేశం.

అయితే వైసీపీ చేస్తున్న ఈ ప్రయత్నాలను తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు టీడీపీ నేతలకు పిలుపునిస్తున్నారు. కానీ టీడీపీ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదు. ఒకరిద్దరు నాయకులు మాత్రమే ఈ అంశంపై స్పందిస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా మంత్రి సుభాష్ సీరియస్ కామెంట్లు చేశారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై వైసీపీ చేస్తున్నది రాజకీయమేనని, ప్రజలకు మేలు జరుగుతున్నావారు ఓర్చుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. ఇదే సమయంలో వైసీపీకి బలమైన కౌంటర్ ఇచ్చారు.

“వైసీపీ కోటి సంతకాల సేకరణ చేయాల్సింది పీపీపీ విధానంపై కాదు. 2024 ఎన్నికల్లో ప్రజలు 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఎందుకు దింపేశారో దానిపై కోటి సంతకాలు సేకరించాలి. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఎందుకు చేశారో దానికి కోటి సంతకాలు సేకరించాలి. వైసీపీ నాయకులను ఎందుకు చిత్తుచిత్తుగా ఓడించారో దానికి కోటి సంతకాలు సేకరించాలి” అని వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ నాయకుడు కొడాలి నానిపై కూడా మంత్రి సుభాష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు రెడ్ బుక్ అంటే ఆయనకు జోక్‌గా ఉండేదని, ఇప్పుడు ఆ పేరు ఎత్తితేనే చలి జ్వరం వస్తోందన్నారు. అందుకే ఇన్నాళ్లైనా బయటకు రావడం లేదని ఎద్దేవా చేశారు.

రెడ్ బుక్ అంటే కొడాలి నాని కలలో కూడా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అందుకే గజగజ వణుకుతున్నాడని విమర్శించారు. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వారు ఇప్పుడు బయటకు రావాలని సవాల్ విసిరారు. ప్రజలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటోందని మంత్రి చెప్పారు. కనుచూపు మేరలో కూడా వైసీపీకి భవిష్యత్తు కనిపించడం లేదని విమర్శించారు.